గణేశ్ ఉత్సవాల రద్దీని తట్టుకోవడానికి పుణే, పింప్రి-చించ్‌వాడ్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందించడానికి అదనంగా బస్సులు నడుపుతున్నారు. చివరి మూడు రోజులు ‘పుణే మహానగర్ పరివాహన్ పరిమండల్ లిమిటెడ్’ (పీఎంపీఎల్) బస్సు సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల రద్దీని తట్టుకోవడానికి పుణే, పింప్రి-చించ్‌వాడ్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందించడానికి అదనంగా బస్సులు నడుపుతున్నారు. చివరి మూడు రోజులు ‘పుణే మహానగర్ పరివాహన్ పరిమండల్ లిమిటెడ్’ (పీఎంపీఎల్) బస్సు సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం 622 బస్సులను ఏర్పాటు చేసినట్టు పీఎంపీఎల్ అధికారి కాలేకర్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన వినాయకుని ఉత్సవాలు పుణేలో ఘనంగా నిర్వహిస్తారు. వీటిని తిలకిచేందుకు రాష్ట్రంలోని ప్రజలతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు పుణేకి వస్తుంటారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పుణే, పింప్రి-చించ్‌వాడ్‌లోని ప్రముఖ మార్గాలపై 24 గంటలపాటు బస్సు సేవలను అందిస్తున్నారు.
ఈ సేవలు ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. శివాజీమార్గంలో అధిక బస్సులు నడుపుతామని పీఎంపీఎల్ తెలిపింది. అయితే ఉత్సవాల సందర్భంగా ఈ మార్గంలో మొదటి రోజు నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో 17 బస్సు రూట్లను నెహ్రూ రోడ్డుపై నుంచి, మరో 18 బస్సులను తిలక్‌మార్గంపై మళ్లించి నడపనున్నారు. ఇందుకోసం కొన్ని బస్సులు ఎస్‌జీ బర్వే చౌక్ నుంచి జంగ్లీ మహారాజు రోడ్డుపై నుంచి తిలక్ మార్గం మీదుగా లేదా శాస్త్రినగర్ రోడ్డుపై నుంచి నడపనున్నారు.
మరికొన్ని బస్సులను జీజామాతా చౌక్ నుంచి నెహ్రూ రోడ్డు వైపు మళ్లిస్తారు. శివాజీ రోడ్డుపై బస్టాప్‌లను మార్చి సంబంధిత వివరాలతో కూడిన బోర్డులను కూడా అమర్చనున్నారు. ప్రముఖ మార్గాలపై రాత్రంతా నడిచే బస్సుల్లో అదనంగా రూ.ఐదు వసూలు చేస్తారు. కార్పొరేషన్ భవనం, డెంగలే వంతెన, స్వార్‌గేట్, డెక్కన్ కార్నర్, పుల్‌గేట్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ బస్సులు ఉంటాయి. వీటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9881495589 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయవచ్చు.