
మెట్రోకు ‘డచ్ ' ఫ్లేవర్
- నెదర్లాండ్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- వెల్లడించిన సీఎం ఫడ్నవీస్
- కోస్టల్ రోడ్ మెట్రోట్రాక్ సాధ్యాసాధ్యాలపై నిపుణుల సహాయం
ముంబై: మెట్రో కోస్టల్ రోడ్ ప్రాజెక్టు విషయమై నెదర్లాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ, ఉత్తర ముంబైలను కలుపుకూ కోస్టల్ రోడ్ గుండా నిర్మించ తలపెట్టిన మెట్రోట్రాక్ సాధ్యాసాధ్యాలపై డచ్ సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోనుంది. ఈ మేరకు నెదర్లాండ్ ప్రభుత్వంతో శనివారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశం అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రకృతితో పనిచేయడం’ ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశమని, నెదర్లాండ్‌కు భూమిని పునర్వినియోగించుకోవడంలో నైపుణ్యం ఎక్కువ అని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఫ్లోరీకల్చర్, బయోటెక్, శక్తి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ తదితర అంశాల్లో డచ్, మహారాష్ట్ర మధ్య పరస్పర సహకారానికి ఎంతో అవకాశం ఉందని అన్నారు.
స్థలం తక్కువ, జనాభా ఎక్కువ
సముద్రంలో మౌలిక సదుపాయాలు, భూమిని సృష్టించడం లాంటి పనుల్లో నెదర్లాండ్‌కు ఎంతో నైపుణ్యం ఉందని అన్నారు. అక్కడి 17 శాతం భూమి సముద్రం, సరస్సుల నుంచి పొందిందేనని అన్నారు. భూమి తక్కువగా ఉన్న కారణంగా ముంబై, నెదర్లాండ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉందని, కాబట్టి సముద్రంలో భూమిని సృష్టించాల్సిన అవసరం ఏర్పడి ందన్నారు. మెట్రో-రోడ్ ప్రాజెక్టును ఎలా అమలు చేయాలనే విషయమై గత నెలలో ఇద్దరు డచ్ ప్రభుత్వ నిపుణులు ముంబై వచ్చారని అన్నారు. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రణాళికలను వారు పరిశీలించారని చెప్పారు. కోస్టల్ ప్రాంతంలో భూసేకరణ అవసరం లేదని సీఎం అన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదు..
రాష్ట్రంలో దాదాపు 150 డచ్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయని డచ్ ప్రధాని అన్నారు. జకార్తా, పనామా, న్యూయార్క్ ఇలా ప్రపంచం అంతటా సమస్యలును ఎలా ఎదుర్కోవాలో తమ నిపుణులు సలహాలిస్తున్నారన్నారు. ఇక ఇప్పుడు ముంబైలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. నీటి నిర్వహణ కోసం హెంక్ ఓవింక్ అనే సంస్థను రాష్ట్రానికి పంపనుందని చెప్పారు. భూగర్భ టన్నెల్స్‌తో లైన్ 3 స్టేషన్లను, మెట్రోను కలిపే ఏర్పాటు చేయనున్నట్లు, ఎయిర్‌పోర్టుల వద్ద కదిలే వాక్‌వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సముద్రమట్టం పెరగకుండా కొత్త కోస్టల్ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత తీరం, ఏర్పాటు చేయనున్న రోడ్డు ద్వారా వర్షాకాలంలో వరదలు తగ్గించవచ్చని డచ్ ప్రధాని అన్నారు. ప్రతిపాదిత కొత్త తీరరోడ్డు ప్రాం తంలో ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నిర్మాణాలు చేపట్టే సమయంలో నగర ట్రాఫిక్‌కు అంతరాయం కలగదన్నారు.