సాక్షి, చెన్నై:కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై పూర్తి హక్కులను తమిళనాడు మాత్రమే పొందింది. అయితే, ఈ హక్కులను కాలరాయడమే లక్ష్యంగా కేరళ పాలకులు ఆది నుంచి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఈ చర్యలు తేని, రామనాథపురం, శివగంగై, దిండుగల్, మదురై జిల్లాలోని అన్నదాతల్లో తరచూ ఆక్రోశాన్ని రగుల్చుతున్నారుు. మూడేళ్ల క్రితం ఏకంగా ఈ డ్యాంకు ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మాణం లక్ష్యంగా కేరళ పాలకులు కసరత్తులు వేగవంతం చేశారు. ప్రస్తుతం ఉన్న డ్యాం ఆనకట్టలు బలహీనంగా ఉన్నాయన్న ప్రచారంతో నీటి మట్టాన్ని తగ్గించేశారు. ఈ ప్రభావం రాష్ర్టంలోని ఆ డ్యాం ఆధారిత జిల్లాల్లో కరువుకు దారి తీసింది. ఈ డ్యాం కూలిన పక్షంలో ఎదురయ్యే పరిస్థితులను కళ్లకు గట్టినట్టుగా ఓ చిత్రాన్ని కేరళకు చెందిన దర్శకుడు రూపొందించడం పెను వివాదానికి దారి తీసింది.
ఈ చిత్ర నిషేధంతోపాటుగా ఆ డ్యాం మాదేనన్న నినాదంతో నెలల తరబడి రాజుకున్న ఆందోళనలు అటు కేరళ, ఇటు తమిళనాడు సరిహద్దులను అట్టుడికించాయి. రెండేళ్లుగా ఉద్రిక్తతల వివాదం సద్దుమణిగినా, కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు తమిళులకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారు. అన్నదాతల్లో ఆనందాన్ని నింపాయి. డీఎంకే, అన్నాడీఎంకే లు ఈ తీర్పు ఘనత తమదంటే తమదేనని డప్పులు వాయించుకునే పనిలో పడ్డాయి. అయితే, ఆ తీర్పునకు వ్యతిరేకంగా కేరళలో నిరసన జ్వాల రాజుకుంది. తమిళుల మీద దాడులకు పరిస్థితులు దారి తీస్తుండడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎక్కడ మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటుందోనన్న ఉత్కంఠ బయలు దేరింది.
మాదంటే..మాదే: తీర్పును ఆహ్వానించిన అన్నాడీఎంకే ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలబడింది తామేనని చాటుకునే పనిలో పడింది. ఇందులో తమ హస్తం కూడా ఉందంటూ డీఎంకే డప్పుకొడుతోంది. సుప్రీం కోర్టు మార్గ దర్శకం మేరకు త్వరితగతిన తీర్పును అమలు చేయాలంటూ డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ తీర్పులో తమకు భాగం ఉందని కాంగ్రెస్ సైతం ప్రకటించుకుంటోంది. కేంద్ర మంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో నిరసనలు బయలుదేరడం శోచనీయమని విమర్శించారు.దాడులతో అలర్ట్ : తీర్పును జీర్ణించుకోలేని కేరళ అన్నదాతలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. అక్కడి బంద్‌తో తమిళనాడు నుంచి వెళ్లాల్సిన అనేక లారీలు సరిహద్దుల్లోనే నిలిపి వేశారు.
బంద్‌ను అడ్డం పెట్టుకుని తమిళనాడు వాహనాల మీద ఆందోళనకారులు దాడులు చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు గట్టి భద్రతే కల్పించారు. అయితే, పత్తినం తట్టకు కూలి పనులకు వెళ్లి వస్తున్న తమిళుల మీద దాడి జరిగిన సమాచారంతో మరింత అప్రమత్తం అయ్యారు. తెన్‌కాశికి చెందిన తొమ్మిది మంది కూలీలపై కేరళ నిరసనకారులు దాడులు చేసిన సమాచారంతో సరిహద్దుల్లో కలకలం బయలు దేరింది. తేని, కోయంబత్తూరు, సెంగోట్టై మీదుగా కేరళ వెళ్లే మార్గాల్లో పెద్ద ఎత్తున తమిళులు నివసిస్తుండడంతో వారికి భద్రత కల్పించే పనిలో రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది పడ్డారు. తమిళుల మీద దాడి నెపంతో రాష్ట్రంలో ఉన్న మలయాళీలపై ఇక్కడి నిరసన కారులు ప్రతాపం చూపించిన పక్షంలో వివాదం మరింత రాజుకుంటుందన్న ఆందోళన నెలకొంది. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడొద్దంటూ పోలీసులు హెచ్చరించే పనిలో పడ్డారు.
పునఃసమీక్షకు రెడీ: రాష్ర్టంలో తీర్పును ఆహ్వానిస్తూ అన్నదాతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జయలలితను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, కేరళ సర్కారు మాత్రం చకచకా పావులు కదిపే పనిలో పడింది. మంత్రి వర్గంతో భేటీ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంది ఆ తీర్పును తీవ్రంగా ఖండించారు. ఆ తీర్పు పునఃసమీక్షకు అప్పీలు పిటిషన్ దాఖలుకు సిద్ధం అవుతున్నారు. కేరళ భద్రతను సుప్రీం కోర్టు గాలికి వదిలిందింటూ, ఆ డ్యాంపై మళ్లీ కుట్రలకు కేరళ సర్కారు సిద్ధం అవుతోండటంతో ఎక్కడ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటుందోనన్న ఆందోళన బయలు దేరింది. ఉమెన్‌చాంది సర్కారు తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేందుకు అక్కడి సీపీఎం సైతం సిద్ధం అవుతోంది. ఆ పార్టీ నేతలు సీతారాం ఏచూరి, అచ్యుతానందన్‌లు మీడియాతో మాట్లాడుతూ, తీర్పును ఖండించారు. కేరళ భద్రతను సుప్రీం కోర్టు పట్టించుకోనట్టుందని వారు పేర్కొనడం గమనార్హం. కేరళలోని కాంగ్రెస్ వాదులు, వామపక్ష నేతలు డ్యాంకు వ్యతిరేకంగా మళ్లీ కుట్రలకు సిద్ధం అవుతున్న తరుణంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, వామపక్ష నాయకులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
‘ముల్లై’ చిచ్చు
Published Thu, May 8 2014 11:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement