ఆగిన వేట
♦ జాలర్ల సమ్మె బాట
♦ పడవలు ఒడ్డుకే పరిమితం
♦ రాష్ట్రవ్యాప్తంగా పోరుకు పిలుపు
♦ శ్రీలంకపై ఒత్తిడికి డిమాండ్
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్టాలిన్, పన్నీరు ఫైర్
ఓవైపు వరుస దాడులు సాగిస్తూ, మరోవైపు తమకు పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష, రూ.రెండు నుంచి 20 కోట్ల మేరకు జరిమానా అంటూ శ్రీలంక ప్రభుత్వం చట్టం తీసుకురావడం తమిళ జాలర్లను ఆందోళనలో పడేసింది. రామేశ్వరం జాలర్లు ఆదివారం నుంచి సమ్మె సైరన్ మోగించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా తీరం వెంబడి పోరుబాట ఉధృతం చేద్దామని జాలర్ల సంఘాలు పిలుపునిచ్చాయి.
సాక్షి, చెన్నై :
రాష్ట్ర జాలర్లకు కడలిలో భద్రత కరువైన విషయం తెలిసిందే. బతుకుదెరువు కోసం సముద్రంలోకి వేటకు వెళ్లే వాళ్లు, తిరిగి వచ్చేనా అన్నది అనుమానమే. దినదిన గండం అన్నట్టుగా నిత్యం జాలర్ల కుటుంబాలు తమ వారికోసం సాగరం వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇందుకు కా రణం శ్రీలంక సేనలు సృష్టిస్తున్న వీరంగాలే. దాడులుచేసి చితక్కొట్టడమే కాదు, పడవలతో సహా జాలర్లను బందీగా పట్టుకెళ్తున్నారు.
తమ వాళ్లు శ్రీలంక చెరలో మగ్గుతున్నా, పాలకులు మౌనం వహిస్తున్నప్పుడల్లా జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గత రెండు నెలలుగా శ్రీలంక సేనలు కడలిలో సృష్టిస్తున్న వీరంగానికి డెబ్బై మందికి పైగా జాలర్లు బందీగా ఆ దేశ చెరలో మగ్గుతున్నారు. వందకు పైగా పడవలు ఆ దేశం గుప్పెట్లో ఉండటంతో, ఇక్కడున్న వాటి యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇన్నాళ్లు శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయించాలని, పడవల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పట్టుబడుతూ జాలర్లు ఆందోళనల బాట సాగిస్తే, తాజాగా, తమ భద్రతకు ఏదీ భరోసా అనే నినాదాన్ని అందుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి రామేశ్వరం జాలర్లు సిద్ధమయ్యారు.
సమ్మె సైరన్
రాష్ట్రంలో 13 సముద్ర తీర జిల్లాలు ఉన్నాయి. ఇందులో నాగపట్నం, పుదుకోట్టై, రామనా«థపురం జిల్లాల సరిహద్దులు సాగరంలో శ్రీలంకకు సమీపంలో ఉన్నాయి. సముద్రంలో నెలకొనే పరిస్థితులతో సరిహద్దులు దాటడం ఇక్కడ ఎక్కువే. అదే సమయంలో భారత భూభాగంలోకి వచ్చి మరీ శ్రీలంక సేనలు వీరంగం సృష్టించిన సందర్భాలు అనేకం.
రామనాథపురం జిల్లా రామేశ్వరానికి కూత వేటు దూరంలోని కచ్చదీవులు ఒకప్పుడు భారత భూ భాగమే అయినా, ప్రస్తుతం శ్రీలంక గుప్పెట్లో ఉండటంతో, ఆప్రాంతాన్ని సమీపిస్తే చాలు బందీగా పట్టుకెళ్లడం శ్రీలంక నావికాదళానికి పరిపాటిగా మారింది. ఆదివారం వేకువ జామున జగదాపట్నంకు చెందిన ఐదుగురితో పాటుగా నాగప్నటంకు చెందిన మరికొందరు జాలర్లను శ్రీలంక సేనలు పట్టుకెళ్లాయి. దీంతో రామేశ్వరం నుంచి మరోమారు జాలర్ల పోరుబాట మొదలైంది. నిరంతర సమ్మె సైరన్ అంటూ వేటను బహిష్కరించారు. జాలర్లు కడలిలోకి వెళ్లకపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యాయి.
దీంతో చేపల విక్రయదారులు, ఐస్ గడ్డల పరిశ్రమలకు నష్టాలు, కష్టాలు తప్పలేదు. వేటను బహిష్కరించిన తాము ఇక, పోరుబాటతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నామని రామేశ్వరం జాలర్ల సంఘాలు ప్రకటించాయి. అలాగే, భద్రతకు భరోసా కరువు అవుతున్న దృష్ట్యా, రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీర జిల్లాల్లోని జాలర్ల సంఘాలను ఏకం చేస్తూ రాష్ట్ర జాలర్ల సంఘాలు పోరును మరింత ఉధృతం చేయడానికి కార్యాచరణ మొదలెట్టాయి. నిజంగా జాలర్ల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో సంప్రదింపులు జరపాలని, దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటుగా, శ్రీలంక తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దుచేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నేతల ఆగ్రహం
జాలర్లకు వ్యతిరేకంగా శ్రీలంక తీసుకొచ్చిన చట్టంపై డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలన్నర రోజుల్లో శ్రీలంక తమిళ జాలర్లు 75 మందిని బందీలుగా పట్టుకెళ్లినా, వారిని విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్టాలిన్ పేర్కొన్నారు. జాలర్లకు మద్దతుగా అన్ని పార్టీలు ఏకం కావాలని, ఆదిలోనే శ్రీలంక చట్టాన్ని తుంచి పడేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జాలర్లకు భద్రత అన్నది అనుమానంగా మారి ఉన్నది. దీనిపై సీఎం స్పందించాలని, ప్రధాని మీద ఒత్తిడితో వారికి న్యాయం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని పన్నీరు సెల్వం డిమాండ్‌చేశారు.