వీరుడికి వీడ్కోలు | Tamil militant leader Ilaiyarajy was fired at the service of the country | Sakshi
Sakshi News home page

వీరుడికి వీడ్కోలు

Published Tue, Aug 15 2017 5:32 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

వీరుడికి వీడ్కోలు

కన్నీటి సంద్రంలో కండనై
తల్లికి కడుపు కోత
తనయుడికి అంత్యక్రియలు
కడచూపు నోచుకోని తండ్రి
నచ్చిన స్థలంలోనే శాశ్వత నిద్రలోకి...
అధికారిక లాంఛనాలు
రూ. 20 లక్షలు సాయం : సీఎం


దేశ సేవలో అమరుడైన తమిళ సైనిక వీరుడు ఇళయరాజా భౌతిక కాయానికి కన్నీటి వీడ్కొలు పలికారు. వారసుడి మరణ సమాచారం కూడా తెలియని స్థితిలో తండ్రి, నవమాసాలు మోసిన తనయుడికి తానే అంత్యక్రియలు జరపాల్సిన పరిస్థితి ఆ తల్లికి రావడాన్ని చూసిన కండనై గ్రామం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అధికారిక లాంఛనాలు, ఆర్మీ గౌరవ వందనం నడుమ ఇళయరాజా భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం ఖననం చేశారు.

సాక్షి, చెన్నై :  కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలోని జైన్‌ బోరా పరిసరాల్లో పాకిస్తానీ ముష్కరుల చొరబాటును తిప్పికొట్టే క్రమంగా జరిగిన కాల్పుల్లో తమిళ జవాను అమరుడైన విషయం తెలిసిందే.  శివగంగై జిల్లా ఇలయాంకుడి కండనై గ్రామానికి చెందిన పెరియస్వామి, మీనాక్షి దంపతుల కుమారుడు ఇళయరాజా మరణ సమాచారం సర్వత్రా దిగ్భ్రాంతికి గురిచేసింది. 

నాలు గేళ్ల క్రితం భారత సైన్యంలో చేరి, దేశ సేవలో ఉన్న ఇళయరాజా భార్య సెల్వి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కావడంతో ఆ కుటుంబం రోదన వర్ణణాతీతం. 20 రోజుల క్రితం సెలవు మీద ఇక్కడకు వచ్చి భార్యను పరామర్శించడంతో పాటు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గ్రామాన్ని చుడుతూ, బంధుమిత్రుల్ని పలకరించి వెళ్లిన ఇళయరాజా ప్రస్తుతం జీవచ్ఛవంగా రావడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకున్నారు.

తండ్రికి కడచూపు కరువు 
పేదరికంలో మునిగిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సైనికుడు ఇళయరాజా. తమకు కొంత స్థలం ఉన్నా, కరువు తాండవంతో ఆయన తండ్రి పెరియ స్వామి రైతు కూలిగా మారాడు. నెలలో కొద్ది రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉండే పెరియస్వామి, మూడు రోజుల క్రితం పని నిమిత్తం కోయంబత్తూరుకు వెళ్లాడు. అయితే, కోయంబత్తూరులో ఆయన ఎక్కడున్నాడో, ఈ మారుమూల గ్రామంలో పనిచేసుకుంటున్నాడో తెలియని పరిస్థితి. ఆయన వద్ద సెల్‌ఫోన్‌ కూడా లేని దృష్ట్యా, తనయుడి మరణ సమాచారం చేరవేయ లేని పరిస్థితి. తనయుడి కడచూపు కూడా ఆయనకు దక్కకపోవడం ఆ గ్రామాన్ని కలచి వేస్తోంది.

కన్నీటి సంద్రం
ఢిల్లీ నుంచి మదురై విమానాశ్రయానికి సోమవారం మధ్యాహ్నం ఇళయరాజా మృతదేహాన్ని అధికారులు చేర్చారు. మదురై జిల్లా కలెక్టర్‌ వీర రాఘవరావుతో పాటు ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆర్మీ వాహనంలో కండనై గ్రామానికి చేరుకున్నారు. కృష్ణ జయంతి వేడుకల్ని కోలాహలంగా ఆ గ్రామం జరుపుకోవడం ఆనవాయితీ.

అయితే, తమ వీరుడి మరణంతో వేడుకల్ని ఆ గ్రామస్తులు రద్దుచేశారు. ఈ వేడుక నిమిత్తం వచ్చిన బంధుమిత్రులు అందరూ ఇళయరాజా భౌతిక కాయం కోసం ఎదురుచూశారు. గ్రామ సరిహద్దులోకి ఆర్మీ వాహనం రాగానే, ఊరేగింపుగా అతడి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. కాసేపు అక్కడ మృతదేహాన్ని ఆప్తులు, బంధువుల సందర్శనార్థం ఉంచారు. ఆ సమయంలో అక్కడ కన్నీటి రోదనలు మిన్నంటాయి.

తనయుడికి తల్లి అంత్యక్రియలు
ఆర్మీ లాంఛనాలతో మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తరలించగా, ఊరేగింపు ఉద్వేగభరితంగా సాగింది. గ్రామం అంతా తరలిరావడంతో ఎవర్ని చూసినా కన్నీటి పర్యంతంతో మునిగినవాళ్లే. ఇందుకు కారణం, తనకు ఎంతో ఇష్టమైన సొంత స్థలంలోనే శాశ్వత నిద్రలోకి ఇళయారాజా వెళ్లనున్నడమే. అలాగే, అంత్యక్రియలు జరిపేందుకు మరెవరూ ఆ కుటుంబంలో లేక పోవడమే. ఆ స్థలం వద్ద అధికారిక లాంఛనాలు ముగిశాయి. వీరుడికి వీర వందనాన్ని ఆర్మీ వర్గాలు సమర్పించాయి.

భారత జాతీయ పతాకాన్ని ఇళయరాజా తల్లి మీనాక్షి అందుకున్న సమయంలో అక్కడ  బోరున విలపించిన వాళ్లే ఎక్కువ. అధికారిక లాంఛనాలు ముగిసిన అనంతరం మృత దేహానికి సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే, నవమాసాలు మోసి కన్న కొడుక్కి తానే అంత్యక్రియలు జరపాల్సి రావడంతో ఆ తల్లి గుండెలు బరువెక్కాయి. ఆమెను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. లాంఛనాలు ముగిసినానంతరం ఇళయరాజా మృత దేహాన్ని ఖననం చేశారు.

కాగా, వారసుడి మరణ సమాచారం కూడా తెలియని తండ్రి, తనయుడికి తానే అంత్యక్రియలు జరపాల్సి రావడంతో  ఆ తల్లి, కడుపులో ఉన్న బిడ్డను కూడా కనులారా చూడకుండా వెళ్లిన భర్త.. ఇలా ఆ కుటుంబ రోదనను తలచుకుని ఆ గ్రామమే తీవ్ర మనోవేదనలో మునిగింది. ఇక, ఇళయరాజా మృతికి సీఎం పళని స్వామి తన సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబానికి రూ.20 లక్షలు సాయం ప్రకటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement