ఉపాధ్యాయుడే పరీక్ష రాసిన వైనం | teacher writing exam for students | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడే పరీక్ష రాసిన వైనం

Published Sun, Jun 19 2016 8:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

teacher writing exam for students

తొమ్మిది మంది ఫలితాల నిలిపివేత
 
టీనగర్: ప్లస్‌టూ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకోవడంతో తొమ్మిది మంది విద్యార్థుల ఫలితాలను విద్యాశాఖాధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా విద్యార్థులు అధిక శాతం మార్కులు పొందేందుకు ఉపాధ్యాయుడే పరీక్ష రాసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈరోడ్ జిల్లా అందియూరులోగల ఒక ప్రైవేటు పాఠశాలలోను, కరూరు జిల్లా తురైయూరులోగల ఒక ప్రైవేటు పాఠశాలో జరిగిన పరీక్షల అక్రమాలు ప్రభుత్వ విద్యాశాఖను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందియూరులోగల సదరు పాఠశాలలో చదివిన ఐదుగురు ప్లస్‌టూ విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుడే పరీక్ష రాశారు. మేథమేటిక్స్, కెమిస్ట్రీ పరీక్షల్లో ఈ అక్రమాలు జరిగాయి.
 
దీని గురించి ప్రభుత్వ పరీక్షల శాఖకు ఫిర్యాదు అందింది. దీంతో దిగ్బ్రాంతి చెందిన అధికారులు దీనిపై విచారణ జరిపేందుకు రంగంలోకి దిగారు. ఇక్కడి విద్యార్థుల ఆన్సర్‌షీట్లను సబ్జెక్టుల వారీగా తనిఖీ చేశారు. ఐదుగురు విద్యార్థుల ఆన్సర్‌షీట్లలో మాత్రం సంతకం ఒకేలా ఉండడం కనుగొన్నారు. క్లూస్ టీం ఆధారంగా జరిపిన పరిశోధనల్లో ఇది ధ్రువపడింది. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్షల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి రప్పించి అధికారులు విచారణ జరిపారు. తురైయూరులోగల ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం స్వయంగా చిట్టాలు అందించి సాయపడింది. ఈ వ్యవహారంలో నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.  వీరి ఆన్సర్ షీట్లను పరీక్షించగా వీరు చిట్టాలతో పరీక్షలు రాసినట్లు తేలింది.
 
ఫలితాల నిలిపివేత:
 ప్లస్‌టూ ఫలితాలు గత నెల 16వ తేదీన విడుదలయ్యాయి. అక్రమాలకు పాల్పడిన తొమ్మిది మంది విద్యార్థుల ఫలితాలను పరీక్షల శాఖ నిలిపివేసింది. విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలంటూ అప్పీలు చేసుకున్నారు. కోర్టులోను తల్లిదండ్రులు కేసు దాఖలు చేశారు. అయితే ప్రభుత్వ పరీక్షల శాఖ ఆ విద్యార్థులను ఈ ఏడాది పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇలావుండగా విద్యార్థుల కోసం పరీక్ష రాసిన ఉపాధ్యాయుడు ఎవరు? అతని ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం దీన్ని దాచేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడిన సదరు పాఠశాలల పరీక్ష కేంద్రాలను రద్దు చేసేందుకు పరీక్షల శాఖ పరిశీలిస్తూ ఉంది.

Advertisement

పోల్

Advertisement