పోరాటాల గడ్డ నిర్మల్ | telangana movement in 1969 in nirmal | Sakshi
Sakshi News home page

పోరాటాల గడ్డ నిర్మల్

Published Sat, Oct 15 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

పోరాటాల గడ్డ నిర్మల్

పోరాటాల గడ్డ నిర్మల్

నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా..
నేడు జిల్లా సాధన కోసం..
ఉద్యమ ఫలితంగానే జిల్లా ఏర్పాటు
చారిత్రాత్మక జిల్లాగా నిలువనున్న నిర్మల్
 
ఆనాడు తెలంగాణ విముక్తి కోసం నిర్మల్ కేంద్రంగా సాయుధ పోరాటం జరిగింది. నైజాం, ఆంగ్లేయుల నిరంకుశ పాలనను తుదముట్టించి తెలంగాణ సాయుధ పోరాటంలో నిర్మల్ ప్రాంతానికి చెందిన పోరాటయోధుల చూపిన పటిమ అమోఘం. ఆ తర్వాత ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. నాటి ఉద్యమానికి నిర్మల్ కేంద్రంగా నిలిచింది. అదే తరహాలో జిల్లా సాధనకూ ఉద్యమం జరిగింది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపి నిర్మల్ జిల్లాను సాధించుకున్నారు. నిర్మల్ ప్రజల పోరాట పటిమపై ప్రత్యేక కథన ం..  - నిర్మల్ అర్బన్
 
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం..
ఆంధ్రపాలనతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో జరిగిన ఉద్యమంలోనూ నిర్మల్ ప్రాంతం ముందువరుసలో ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ నిర్మల్‌వాసులు చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడి నాయక త్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, డాక్టర్ జేఏసీలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.
 
 రాంజీగోండ్ నేతృత్వంలో..
 పోరాట యోధుడు రాంజీగోండ్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సాయుధ పోరు సాగించారు. రాంజీగోండ్ నేతృత్వంలో దాదాపు 150ఏళ్ల క్రితం జిల్లాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. ఆయన నేతృత్వంలో అనేక మంది గిరిజన యువకులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని భారీ సంఖ్యలో సమీకరించి పోరు జరిపారు. నిర్మల్, ఉట్నూర్, సిర్పూర్‌లతో పాటు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, యావత్‌మాల్, మాహోర్ తదితర ప్రాంతాల్లో రాంజీగోండ్ ఆధ్వర్యంలో ఆంగ్లేయుల సైనికులపై దాడులు చేసి వారి గుండెల్లో గుబులు రేపారు. ప్రధానంగా అప్పట్లో సురక్షిత ప్రాంతంగా నిర్మల్ ఉండడంతో ఇక్కడి నుంచే పోరాటాన్ని నడిపించేందుకు వ్యూహరచనలు సాగించారు.
 
 అంతేకాకుండా ఆయుధాల స్థావరాలుగా కూడా ఏర్పర్చుకున్నారు. జరుగుతున్న పోరును అణచివేసేందుకు ఆంగ్లేయులు వివిధ రూపాల్లో అనేక పన్నాగాలు పన్నారు. దాంట్లో భాగంగానే కొందరు నజరానాలకు ఆశపడి రాంజీగోండు కదిలికలను చేరవేయడంతో నిర్మల్ శివారులోని సోన్ సమీపంలో గోదావరి నది వద్ద మాటు వేసి 1857 సెప్టెంబర్ 17న రాంజీగోండ్‌తో పాటు ఉద్యమకారులను సైనికులు పట్టుకున్నారు.
 
 వెయ్యి మందిని ఉరి తీశారు
పట్టుబడ్డ రాంజీగోండ్‌తో పాటు పోరాట యోధులను నిర్మల్ మండలం ఎల్లపెల్లికి వెళ్లే దారిలో పట్టణ శివారులోని ఖజానా చెరువు వెనుకభాగంలో ఉన్న భారీ మర్రి చెట్టుకు రాంజీగోండ్‌తో పాటు వెయ్యిమందిని ఉరితీశారు. ఈ మర్రిచెట్టును వెయ్యి ఉరుల మర్రిగా చెప్పుకునేవారు. అయితే కాలక్రమేణ గతంలో వచ్చిన భారీ ఈదురుగాలులకు ఈ మర్రిచెట్టు నేలకొరిగింది. రాంజీగోండ్ జరిపిన ఆ నాటి పోరును ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమించి తెలంగాణ విముక్తికై పాటుపడ్డారు.
 
 
 జయశంకర్ సారే స్ఫూర్తి
 గతంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా నిర్మల్‌కు కేటాయించిన యూనివ ర్సిటీ ఆదిలాబాద్‌కు తరలిపోయింది. దీనికి కారణం నిర్మల్ జిల్లా కేంద్రం కాకపోవడమే. దీంతో నిర్మల్ జిల్లా ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష ఏర్పడింది. అప్పట్లో విశ్వవిద్యాలయం కోసం ఉద్యమించాం. కానీ నెరవేరలేదు. నిర్మల్ జిల్లా ఏర్పాటైతే యూనివ ర్సిటీ వస్తుందన్న ఆశతో ఆ దిశగా అడుగులు వేశాను. దీనికి తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్‌సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిపాదనోద్యమం చేశాను. జిల్లా కల సాకారమైంది.
 - నంగె శ్రీనివాస్, నిర్మల్ జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
 
నిర్మల్ జిల్లా సాధన సమితికి అంకురార్పణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 2015 సెప్టెంబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటికే సీఎం కేసీఆర్ 10 జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అందులో జిల్లా నుంచి మంచిర్యాలకు మాత్రమే చోటుదక్కింది.
 
నూతన జిల్లాల ఏర్పాటు కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మను నియమించి, జిల్లాల ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ‘నిర్మల్ జిల్లా సాధన సమితి’ని ఏర్పాటు చేసిన నిర్మల్‌కు చెందిన నంగె శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ఆవశ్యకతపై నివేదికను రూపొందించి, జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సచివాలయంలో 2015, నవంబర్ 20న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మను కలిసి నివేదిక అందజేశారు.
 
అదే సమయంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఉన్న ఆకాంక్షను తెలుసుకునేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్మల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలతో ఉద్యమబాట పట్టారు. రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు, పాదయాత్రలు, మానవహారాలు, దీక్షలు చేపట్టారు. సీఎస్ కమిటీ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. గూగుల్ మ్యాప్‌లో పూర్తి సమాచారం తీసుకున్న సీఎం కొత్త జిల్లాగా నిర్మల్‌కు అన్ని విధాలా అర్హతలున్నాయని ప్రకటించారు. నిర్మల్ కొత్త జిల్లాగా ఆవిర్భవించింది.
 
 నిజాం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా..
ఆనాడు నిర్మల్ ప్రాంతంలో గోపిడి గంగారెడ్డి నాయకత్వం వహించి ఆంగ్లేయులు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈయన ఆధ్వర్యంలో నిర్మల్‌కు చెందిన ముడుసు ఎల్లయ్య, గంగిశెట్టి విఠల్, సత్యనారాయణ, గణపతి, లాలూపటేల్, జి.గంగాధర్, గంగారాం, జమునాలాల్, అర్గుల గంగయ్యగుప్తా తదితరులు ఉద్యమంలో ముందుకు సాగి అనేక పోరాటాలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలుపుకుని పోరాటాలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement