సాక్షి, బెంగళూరు : నిరుపేద ప్రవాసాంధ్రులకు చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి పనిచేస్తుందని సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు తెలిపారు. సమితి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గురువారం సాయంత్రం ఇందిరానగర క్లబ్‌లో ఏర్పాటు చేసిన క్యాలెండర్, వెబ్‌సైట్ ఆవిష్కరణల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారంతో పాటు పేద ప్రవాసాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడం కోసం సమితి తరుఫున కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రవాసాంధ్రులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్‌లుగా ఉన్న తెలుగు వారితో పాటు వివిధ విద్యాసంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లోని తెలుగు ప్రముఖుల వివరాలతో ఓ డెరైక్టరీని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏడీజీపీ టి.సునీల్‌కుమార్(సీఆర్‌ఈ), బి.ఎన్.ఎస్.రెడ్డి(డీఐజీ డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ కేఎస్‌ఆర్‌టీసీ), ఎం.చంద్రశేఖర్(డీఐజీ ఆఫ్ పోలీస్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ), టి.వి.రవి (అడిషనల్ కమిషనర్ కస్టమ్స్ విభాగం)లకు సమితి తరఫున జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన వారితో కలిసి 2014 క్యాలండర్‌తో పాటు పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వర రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ... ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మనుషులను, మనసులను దగ్గర చేయగల శక్తి ఒక్క భాషకు మాత్రమే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ మాతృభాష ప్రాభవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. తెలుగు వారందరినీ దగ్గరకు చేర్చే ఇలాంటి సంఘాల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎన్.సంపత్‌కుమార్, నృత్యకారిణి రూపారాణి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
Published Sat, Mar 15 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM