
కిరణ్‌బేడీపై కాంగ్రెస్ ఫైర్
పుదుచ్చేరిలో అధికార పార్టీతో సంబంధం లేకుండా కేంద్రం ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించడంపై కాంగ్రెస్, మిత్రపక్షాలు మండిపడుతున్నాయి.
⇒ గవర్నర్‌ను రీకాల్ చేయాలని బంద్ పాటించిన డీఎంకే
⇒ బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేపై సీఎం ఆగ్రహం
ఉప్పు నిప్పుగా సాగుతున్న సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్‌బేడీల సమష్టిపాలన మరో అంకానికి చేరుకుంది. కయ్యానికి కాలు దువ్వుతున్న కిరణ్‌బేడీని రీకాల్ చేయాలనే డిమాండ్‌పై శనివారం బంద్ పాటించడం ద్వారా మిత్రపక్ష డీఎంకే తన స్నేహధర్మాన్ని చాటుకుంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : పుదుచ్చేరిలో అధికార పార్టీతో సంబంధం లేకుండా కేంద్రం ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించడంపై కాంగ్రెస్, మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోంది. అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ సభ్యుల స్థానాలను ప్రభుత్వ సిఫార్సు మేరకు భర్తీ చేయాల్సి ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసింది.
ఆ నియామకాలను ఖరారు చేస్తూ గవర్నర్ కిరణ్‌బేడీ ముగ్గురి చేత ప్రమాణస్వీకారం చేయించారు. 30 మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో 15 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మిత్రపక్ష డీఎంకే (2) సభ్యుల మద్దతులో అధికారం చేపట్టింది. ఎన్‌డీఏ పక్షం ఉన్న ఎన్‌ఆర్ కాంగ్రెస్ (8), అన్నాడీఎంకే (4), ఒక స్వతంత్య్ర అభ్యర్థితో నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలిపి మరో ఇద్దరిపై ఆకర్‡్ష మంత్రం ప్రయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన సీఎం నారాయణస్వామి మరోసారి గవర్నర్‌పై నిరసన పంజా విసిరారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
గవర్నర్ తీరుకు నిరసనగా బంద్
అధికారంలో ఉండి బంద్ నిర్వహిస్తే ఆక్షేపణకు గురికాక తప్పదని భావించిన సీఎం నారాయణ స్వామి మిత్రపక్ష డీఎంకే సాయం కోరారు. పుదుచ్చేరి ఎన్నికల్లో మద్దతుపలికిన సీపీఐ, సీపీఎం, విసీకే తదితర పార్టీలతో కలిసి శనివారం ఉదయాన్నే రోడ్లపైకి చేరి బంద్ పాటించాయి. దీంతో పుదుచ్చేరి నుంచి బయలుదేరాల్సిన 500 బస్సులు బస్‌స్టేషన్‌కే పరిమితమయ్యాయి. పుదుచ్చేరిలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు.
తమిళనాడు నుంచి పుదుచ్చేరికి బయలుదేరిన బస్సులు సరిహద్దు ప్రాంతాలైన కోట్టకుప్పం, కోరిమేడు ప్రాంతల్లో ప్రయాణికులను దింపివేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. గవర్నర్‌ను రీకాల్ చేయాలని కోరుతూ పుదుచ్చేరిలోని అనేక కూడళ్లలో రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించి నినాదాలు చేశారు. బంద్‌ను లెక్కచేయకుండా చెన్నై నుంచి పుదుచ్చేరి మీదుగా కడలూరు వెళుతున్న ప్రభుత్వ బస్సు ముందువైపు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.