కామాంధుడు జైలు పాలు
- ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ కేసులో..
- ఆరు రోజుల పోలీస్ కస్టడీకి గుండప్ప
- నేటి నుంచి స్కూల్ ప్రారంభం... గట్టి నిఘా
బెంగళూరు : ఇక్కడి జాలహళ్లి మెయిన్ రోడ్డులోని ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న మూడున్నర సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో గుండప్ప అలియాస్ గుండన్న (45)జైలు పాలు అయ్యాడు. అతన్ని బెంగళూరు సీసీబీ పోలీసులు ఇక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి ఆదివారం తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం కోరమంగలలో నివాసం ఉంటున్న 51వ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శోభా గౌడర్ ముందు హాజరు పరిచారు.
నిందితుడిని పూర్తి విచారణ చేసి మరిన్ని వివరాలు సేకరించడానికి సమయం కావాలని, మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు. దీంతో గుండన్నను ఆరు రోజులు కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు గుండప్పను జాలహళ్ళి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ చేస్తున్నారు. కాగా, గుండప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ఏకే కాలనీలో నివాసముంటున్నాడు. ఇతను రెండు సంవత్సరాల నుంచి ఆర్కిడ్ స్కూల్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు.
నేరాన్ని అంగీకరించాడు..
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గుండప్ప నేరం చేసినట్లు స్వయంగా అంగీకరించడంతో శనివారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసు డీసీపీ సురేష్ నేతృత్వంలో మల్లేశ్వరం ఏసీపీ ఫాతిమా ఆధ్వర్యంలో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు.
గుర్తు పట్టిన బాలిక...
ఆర్కిడ్ స్కూల్‌లో పని చేస్తున్న 11 మంది టీచర్లతో పాటు అక్కడ పని చేస్తున్న వారి ఫొటోలు సేకరించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు చూపించారు. గుండప్ప పొటోను చూసిన ఆ బాలిక ‘ ఈ అంకుల్ నన్ను కొట్టాడు..... ఎన్ని సార్లు చెప్పాలి..’ అంటూ హిందీలో చెప్పింది. కాగా, స్కూల్ ట్రస్ట్ అధికారులు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరగడంతో ఐదు రోజుల నుంచి మూతపడిన ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.