- నేటి నుంచి ఇతర లారీలూ బంద్
- సమ్మెలో పెట్రోలు ట్యాంకర్లు, వంట గ్యాస్ రవాణా లారీలు
- టెంపోల యజమానులు కూడా అదే బాట
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలూ బంద్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అర్ధ రాత్రి నుంచి లారీల సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానానికి నిరసనగా ఇసుక లారీల యజమానులు గత మూడు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా ఇతర లారీల యజమానులు కూడా సమ్మె బాట పట్టారు. తద్వారా సరుకు, వాణిజ్య రవాణా వాహనాల రాకపోకలు నిలిచి పోనున్నాయి.
పెట్రోలు ట్యాంకర్లు, వంట గ్యాస్ సిలిండర్లను రవాణా చేసే లారీలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. మరో వైపు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని టెంపోల యజమానులు కూడా సమ్మె బాట పట్టారు. మొత్తం నాలుగు లక్షల టెంపోలు ఇక రోడ్డెక్కవు. డ్రైవర్లకు కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను ఉటంకిస్తోందని సరుకు రవాణా ట్రక్కు సంఘాల సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.
డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ సమయంలో పదో తరగతి మార్కుల జాబితా చూపించాలంటూ బలవంత పెడుతున్నారని ఆరోపించింది. దీని వల్ల లక్షా 70 వేల మంది డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డీజిల్ ధర దేశంలోనే కర్ణాటకలో ఎక్కువని తెలిపింది. పట్టణాలు, నగరాల్లో ట్రక్ టెర్మినళ్లు నిర్మించాలని, టెంపో డ్రైవర్లపై పోలీసులు, ఆర్టీవో అధికారుల వేధింపులను ఆపించాలని డిమాండ్ చేసింది.
అన్నిటికీ కట కట
సరుకు రవాణా లారీలు, టెంపోలు సమ్మెలో పాల్గొంటున్నందున పెట్రోలు, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలు, దిన పత్రికలు, మందులు, కూరగాయలను రవాణా చేసే వాహనాలను సమ్మె నుంచి మినహాయించారు. రోజూ ఇతర రాష్ట్రాల నుంచి 40 వేలకు పైగా లారీలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఆ లారీల యజమానులు కూడా సమ్మెకు సంఘీభావం ప్రకటించినందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉంటుం దనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐటీ, బీటీ కంపెనీలు బాడుగకు తీసుకున్న వాహనాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను సమ్మతించే వరకు సమ్మె విరమించేది లేదని రాష్ట్ర లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు షణ్ముగప్ప తెలిపారు. ఇసుక లారీలు సహా మొత్తం లక్ష వాహనాలు సమ్మెలో పాల్గొంటున్నాయని వెల్లడించారు.