అక్రమ కట్టడాలను కూల్చే సత్తా ఉందా..?
– పన్నుల వసూలులో నిర్లక్ష్యం దేనికి..?
– మున్సిపల్ కమిషనర్లతో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు
అనంతపురం న్యూసిటీ : ‘మున్సిపాలిటీల పరిధిలో అనుమతుల్లేని కట్టడాలు చాలా ఉన్నాయి. వాటిని కూల్చే సత్తా మీలో ఉందా? నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు మునిసిపల్ కమిషనర్లను ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపల్ ఆర్‌డీ కార్యాలయంలో ఆర్‌డీ విజయలక్ష్మితో కలసి ఆయన కమిషనర్లతో సమావేశమయ్యారు. ఇంటి, ఖాళీ జాగా పన్ను, అక్రమ కట్టడాలు, సెల్‌టవర్స్ తదితర వాటిపై విజిలెన్స్ ఎస్పీ ఆరా తీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయని అసహనం వ్యక్తం చేశారు.
ప్రధానంగా 2008 నుంచి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఫంక్షన్ హాల్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురం, హిందూపురం, గుత్తి, ధర్మవరం ప్రాంతాల్లో రూ. కోట్లలో బీపీఎస్ చెల్లించాల్సి ఉందని తేలిందన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో రూ .94 లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనికి టీపీఓ ఇస్సాక్ అహ్మద్ బదులిస్తూ నిర్వాహకులు గతంలోనే బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని కానీ వారి కట్టడాలకు అనుమతి లభించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. హిందూపురంలో ఖాళీ జాగా పన్ను రూ 2 కోట్లు, ధర్మవరంలో రూ .30 లక్షలు, కదిరిలో రూ. 14 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం చేస్తున్నారని విజిలెన్స్ ఎస్పీ అనీల్‌బాబు ప్రశ్నించారు. మొదట అక్రమ భవనాలు, ఖాళీ స్థలాలు, మొండి బకాయిల జాబితాను సిద్ధం చేసి 15 రోజుల్లో పురోగతి సాధించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంతకల్లులో రూ. 7 కోట్ల బకాయిలు: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రూ. 4 కోట్లు, ఏపీ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు నుంచి రూ. 3 కోట్లు బకాయిలు వసూలు కావాల్సి ఉందని మున్సిపల్ ఆర్‌డీ దష్టికి విజిలెన్స్ ఎస్పీ దష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ శాఖల నుంచి ఏ మేరకు వసూలు చేయాలో వాటి వివరాలను సిద్ధం చేయాలన్నారు.