'నన్ను కిడ్నాప్ చేసి, విడిచిపెట్టారు'
న్యూఢిల్లీ: అదృశ్యమైన స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా.. తనను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి, అనంతరం వదిలిపెట్టారని చెప్పింది. ఘజియాబాద్ పోలీసులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చింది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు.
బుధవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా తనను కిడ్నాప్ చేశారని దీప్తి పోలీసులకు చెప్పింది. తన కళ్లకు గంతలు కట్లి, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపింది. తనను 24 గంటల పాటు బందించారని, అనంతరం శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో తనను వదిలివెళ్లారని చెప్పింది. దుండగులు తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని, భోజనం కూడా పెట్టారని తెలిపింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. కాగా దుండగులు దీప్తిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. దీప్తి కిడ్నాప్ ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సీరియస్గా తీసుకుని ఆచూకీ కనుగొనాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.