హోటళ్లపై పోలీసుల దాడి, పట్టుబడ్డ 50 జంటలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంతంలోని రెండు హోటళ్లపై సోమవారం దాడులు నిర్వహించి 50 జంటలను అదుపులోకి తీసుకున్నారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వీరిని పట్టుకుని కొత్వాలీ స్టేషన్ కు తరలించారు. తల్లిదండ్రులను పిలిపించి న్యాయపరమైన చర్యలు చేపట్టారు. రెండు హోటళ్లను పోలీసులు మూసివేశారు.
హోటల్ యజమానులు ఢిల్లీ-ఎన్సీఆర్ మార్గంలో కస్టమర్లకు వలవేసి గంటల చొప్పున గదులను అద్దెకిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఘజియాబాద్ పోలీసులు హోటళ్లపై దాడులు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లపై పోలీసుల దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.