అమ్మా.. అమ్మకే.. | 13 people Baby for sale In six months | Sakshi
Sakshi News home page

అమ్మా.. అమ్మకే..

Published Fri, Feb 27 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

అమ్మా.. అమ్మకే..

అమ్మా.. అమ్మకే..

‘అమ్మా.. అమ్మకే అంటూ శిశువు రోదిస్తోంది. నీవూ ఆడదానివే కదా.. నేను ఆడపిల్లగా పుట్టిన పాపానికి అమ్మేస్తావా?..  ’ అంటూ శిశువు మూగమనసుతో తల్లిని ప్రశ్నిస్తోంది.  
ఆడ శిశువులపై కొనసాగుతున్న వివక్ష
ఆరు నెలల్లో జిల్లాలో 13 మంది శిశువుల విక్రయం
పల్లెలు, తండాల్లో అవగాహన లేకనే..

ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యతా కారణమే

మెదక్ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ మహిళలు ముందుకు పరుగులు తీస్తుంటే.. పలు గ్రామాలు, పట్టణాల్లో ఆడవారిపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. రెండో లేదా మూడో కాన్పులో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు అంగడి సరుకులా జమకట్టి విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఆరునెలల్లో 13 మంది ఆడ శిశు విక్రయాలు జరిగినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఇంకా లెక్కకు రానివి మరె న్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాచైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రస్తుత ఫిబ్రవరి వరకు జిల్లాలో 13 మంది ఆడ శిశువులు తిరస్కరణకు గురయ్యారు. అందులో కొంద రు ఆడశిశులను చెత్తబుట్టల్లో, ముళ్లపొదల్లో పడేయగా మరికొందరిని తాము సాదలేమంటూ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. బాలికల సంరక్షణ కోసం ఎన్నిచట్టాలు వచ్చిన అవేవీ ఆడశిశువులకు అండగా నిలవటంలేదు. అమ్మాయి పుట్టిందంటే తల్లిదండ్రులు వదిలించుకోవాలనే చూస్తున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ దుస్థితి అధికంగా కన్పిస్తోంది.
 
ఒక్క మెదక్ మండలంలోనే గత మూడేళ్లుగా ముగ్గురు ఆడశిశువులను ఒక్క మగశిశువును విక్రయించారు. 2013 నబంబర్ 25న వాడి పంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన లంబాడి రవి, అనిత దంపతులు మూడో సంతానంలోనూ ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. 2014 మార్చి 5న రాజిపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాకు చెందిన లంబాడి పీర్య, విజ్జిలకు రెండో సంతానంలో ఆడబిడ్డ పుట్టిందని బహిరంగంగా విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అదే ఏడాది ఔరంగాబాద్ గిరిజన తండాకు చెందిన లండాడి దశరథం, శాంతి దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా మూడో సంతానంలోనూ మగబిడ్డ పుట్టిందని విక్రయించారు.

ఈ మూడు సంఘటనలు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లగా చిన్నారులను స్వాధీనం చేసుకొని సంగారెడ్డిలోని శిశువిహార్‌కు తరలించారు. తాజాగా ఈనెల 23న కొత్తపల్లి గ్రామానికి చెందిన గార్ల కిష్టయ్య, నర్సవ్వ దంపతులకు మూడో సంతానంలోనే ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ చిన్నారిని ఆసుపత్రి లో చూపించగా అనారోగ్యంతో ఉందని చెప్పడంతో అతను ఆ చిన్నారిని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ విషయం పత్రికల్లో రావడం తో ఐసీడీఎస్ అధికారులతోపాటు శిశుసంరక్షణ జిల్లా అధికారులు కొత్తపల్లికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. సదరు తల్లిదండ్రులతోపాటు కొనుగోలు చేసిన, విక్రయించిన, మధ్యవర్తిగా వ్యవహరించిన ఆశ వర్కర్‌పై అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా ఆడ శిశువుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత వల్లే అవగాహన లేక ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నట్టు సమాచారం. విషయమై ప్రభుత్వం పల్లెలు, తండాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement