
సుప్రసిద్ధ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (86) కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఛాయాదేవి భౌతికకాయాన్ని కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో ఉంచారు.
తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన ఛాయాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. 1960 దశకంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్‌గా ఆమె పనిచేశారు. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్‌సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది.
ఆమె రాసిన 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్నారు. ఛాయాదేవి మరణం పట్ల సాహిత్యాభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.