
గర్భధారణ సమయంలో తల్లులు అధిక కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే.. పుట్టబోయే పిల్లల్లో మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందం టోంది అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. శిశువుకు కొవ్వు తక్కువగా ఉండే, పుష్టినిచ్చే ఆహారాన్ని అందించడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చొచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త యువాన్ జియాంగ్ చెబుతున్నారు. తల్లిదండ్రుల నుంచి సంతానానికి జన్యువులే కాకుండా ఆయా జన్యువులు ఏ సందర్భంలో ఎంత మేరకు పనిచేయాలన్న విషయం కూడా వారసత్వంగా అందుతుందని పేర్కొన్నారు.
ఎపిజెనిటిక్స్ అనే ఈ అంశం తిండి, వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గర్భం ధరించినప్పుడు తల్లులు అధిక కొవ్వు తో కూడిన ఆహారాన్ని తీసుకుంటే జీవక్రియలను ప్రభావితం చేసే జన్యువుల పనితీరులో మార్పులొస్తాయని ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చెప్పారు. ఈ మార్పుల్లో కొన్ని పిల్లలు పెద్దయ్యాక వారిలో మధుమేహానికి దారి తీయొచ్చని చెప్పారు. పసిపిల్లలు తల్లిపాలు తాగడం ఆపేశాక ఇచ్చే ఆహారం ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు తేవొచ్చని, వ్యాధులు దరిచేరకుండా నిరోధించవచ్చన్నారు.