తుపాకితో మహిళను బెదిరించిన వ్యాపారి | Business Man Threats to Woman With Gun in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆయుధ చట్టానికి తూట్లు!

Published Sat, Jul 18 2020 8:45 AM | Last Updated on Sat, Jul 18 2020 8:45 AM

Business Man Threats to Woman With Gun in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆయుధ పూజలో భాగమంటూ గాల్లోకి కాల్చేది ఒకరు... సెటిల్‌మెంట్స్‌లో టార్గెట్‌లకు ప్రదర్శించేది మరొకరు... చిరు వివాదాల నేపథ్యంలో చూపించి బెదిరించేది ఇంకొకరు... ఆత్మరక్షణ కోసం తీసుకున్న లైలైసెన్స్‌డ్‌ తుపాకులు నగరంలో అనేక రకాలుగా దుర్వినియోగం అవుతున్నాయి. ఈ వ్యవహారాలను సీరియస్‌గా తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్‌ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కల్యాణ్‌నగర్‌కు చెందిన వ్యాపారి సురేష్‌ తన లైసెన్స్‌డ్‌ ఆయుధం దుర్వినియోగం చేసినట్లు రూఢీ కావడంతో దాన్ని రద్దు చేస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. నగరంలోని అనేక మంది సా మా న్యులు, ప్రముఖులు తెలిసీ తెలియక ఆయుధ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులకు ఫిర్యాదు కూడా అవసరం లేదని, సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

పూర్తి బాధ్యుడు లైసెన్స్‌ హోల్డరే...
ఓ వ్యక్తికి పొంచి ఉన్న ముప్పు, నిర్వహించే వ్యాపార లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న  తర్వాతే పోలీసు విభాగం ఆయుధ లైసెన్సు మంజూరు చేస్తుంది. సాధారణంగా నేర చరిత్ర, దుందుడుకు స్వభావం ఉన్న వారికి మంజూరు చేయదు. లైసెన్స్‌ పొంది ఆయుధాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దాని పూర్తి రక్షణకు బాధ్యుడు అవుతాడు. లైసెన్స్‌ హోల్డర్‌కు చెందిన తుపాకీని మరో వ్యక్తి వద్ద ఉండటం, చేత్తో పట్టుకుని సంచరించడం ఆయుధ చట్టం ప్రకారం నేరాలే. దీనికి ఆ ఆయుధాన్ని పట్టుకున్న వ్యక్తితో పాటు  లైసెన్స్‌ కలిగిన వ్యక్తి బాధ్యుడు అవుతాడు. బహిరంగ ప్రదేశాల్లో లైసెన్స్‌డ్‌ ఆయుధాన్ని ప్రదర్శించినా, ఎవరినైనా బెదిరించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపించినా అది ఆయుధ చట్టం కింద నేరమే అవుతుంది.

ప్రాణహాని ఉంటేనే కాల్పులు...
లైసెన్స్‌ హోల్డర్‌ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాల్లో మాత్రమే తుపాకీని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమే, ఆర్భాటంలో భాగంగానో, ఆనవాయితీ పేరుతోనో కాల్పులకు దిగడం ఆయుధ చట్ట ప్రకారం నేరమే. లైసెన్స్‌ హోల్డర్‌ ఖరీదు చేసే, ఖర్చు పెట్టే ప్రతి తూటాకీ కచ్చితంగా లెక్కచెప్పాలి. ప్రతి ఏటా పోలీసులు చేసే ఆడిట్‌తో పాటు లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ వ్యవహారాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నవి గుర్తించినా లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంది. దసరా వంటి సందర్భాల్లో ఆయుధ పూజ నేపథ్యంలో కొందరు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా ప్రదర్శించడం చట్ట ప్రకారం తప్పు కాకపోయినప్పటకీ వారితో పాటు వారి సంబంధీకులూ ఆ ఆయుధాలను చేతపట్టుకోవడం మాత్రం ఉల్లంఘన కిందికే వస్తుంది.  
సుమోటో కేసుకీ అవకాశం...
అకారణంగా ఆయుధాన్ని వినియోగించడం, ఎదుటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అవసరం లేకుండా కాల్పులు జరపడం ఇవన్నీ ఆయుధ చట్టం ఉల్లంఘనల కిందికే వస్తాయి. ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు పోలీసులు ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా కేసు నమోదు చేస్తారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు నోటీసులు జారీ చేసి అవసరమైతే లైసెన్స్‌ సైతం రద్దు చేస్తారు. గతంలో సికింద్రాబాద్‌లోని ఓ పత్రిక కార్యాలయం వద్ద హల్‌చల్‌ చేసిన సిటీ నటుడు, బంజారాహిల్స్‌లోని రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద గాల్లోకి కాల్పులు జరిపిన నేత విషయంలో సుమోటో కేసులు నమోదు చేశారు.

గమనిస్తే సమాచారం ఇవ్వండి
నగరంలో లైసెన్డ్స్‌ ఆయుధాలు కలిగిన ఎవరైనా వాటిని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించం. ఇలాంటి వ్యవహారాలు ఎవరైనా గమనిస్తే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వ్యాపారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేసి అతడి ఆయుధ లైసెన్సు రద్దు చేశాం. అలాగే ఫ్లాట్లు, ఇళ్లల్లో వ్యభిచారం, పేకాట శిబిరాల నిర్వహణ వంటివీ ఉపేక్షించం. గడిచిన కొన్నాళ్లల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడంతో పాటు 19 ఇళ్లు/ఫ్లాట్లు సీజ్‌ చేశాం. ఏ అంశం పైన అయినా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ చేయండి.     – కొత్వాల్‌ అంజనీకుమార్, ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement