![car hit the child dead - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/10/car.jpg.webp?itok=T_vFH6R9)
హైదరాబాద్: చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న ఓ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. అటుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో రెండేళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటన సరూర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నల్లగొండ జిల్లా శివన్నగూడాని కి చెందిన నగేశ్, మమత దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్ మాధవనగర్‌లో నివసిస్తున్నారు. నగేశ్ ఓ ప్రైవేటు కళాశాల బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు జశ్వంత్ ఉన్నాడు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన మేనమామ కృష్ణయ్యతో కలసి ఇంటి ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్లి చాక్లెట్ కొనుక్కున్నాడు. జశ్వంత్ వెంట వస్తున్నాడో లేదో చూసుకోకుండానే కృష్ణయ్య రోడ్డు దాటి ముందుకు వచ్చాడు.
దుకాణం నుంచి నడుచుకుం టూ వస్తున్న జశ్వంత్‌ను అటుగా వచ్చిన ఇండికా కారు (టీఎస్–07యూఎఫ్ 1947) ఢీ కొట్టడంతో జశ్వంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని అదే కారు లో చికిత్స నిమిత్తం సంతోష్ నగర్ డీఆర్‌డీఎల్ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించకుండానే నిలోఫర్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అనంతరం జశ్వంత్ కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ తిరుపతి అక్కడినుంచి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి కేసును నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
రెండేళ్ల క్రితం కూతురు.. ఇప్పుడు కొడుకు
నగేశ్ మమతలకు ఒక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. రెండేళ్ల క్రితం గుండెకు రంధ్రం పడి కూతురు మృతి చెందింది. ఉన్న ఒక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గురువారం జరిగిన కారు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment