వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: బుగ్గ కార్ల వాడకంపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ దర్పాన్ని చూపేందుకు యథేచ్ఛగా బుగ్గ కార్లు, హారన్లు వాడుతున్నారని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బుగ్గ కార్లు, హారన్ల వాడకంపై కేంద్రం విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా, రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది డి.భావనప్ప ఈ పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రవాణాశాఖ కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కొన్ని హోదాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే బుగ్గ కార్లు వాడేందుకు నిబంధనలు అనుమతినిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఇటీవల కేంద్రం కూడా పలు ఆంక్షలు తీసుకొచ్చిందని తెలిపారు. కొంతమంది టోల్‌గేట్ల వద్ద వీఐపీలను గుర్తించేందుకు ఉపయోగించే హారన్లను వాడుతున్నారని తెలిపారు. ఇవన్నీ కళ్ల ముందు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.