భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) బ్రాండ్ కారు 'మాగ్నైట్' (Magnite) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అక్టోబర్ 2024లో లాంచ్ అయింది. ఈ మోడల్ ఇప్పుడు ఖండాంతరాలు దాటడానికి సిద్ధమైంది. ఇండియాలో తయారైన అప్డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ త్వరలో లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడవుతాయి.
నిస్సాన్ ఇండియా జనవరి చివరిలో చెన్నై నుంచి దాదాపు 2,900 యూనిట్ల ఎల్‌హెచ్‌డి (లెఫ్ట్ హ్యండ్ డ్రైవ్) వేరియంట్‌ల మొదటి షిప్‌మెంట్‌ను ప్రారంభించింది. మరో 7,100 కార్లు త్వరలోనే ఎగుమతి అవుతాయని సమాచారం. మొత్తం మీద కంపెనీ భారత్ నుంచి 10,000 మాగ్నైట్ కార్లను ఎగుమతి చేయనుంది. ఈ కార్లు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలకు వెళతాయి.
ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో భారత్ కూడా దూసుకెళుతోంది. కాబట్టి చాలా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా కార్లను కోరుకుంటున్నారు. ఈ కారణంగా భారత్ ఎగుమతులకు కూడా కేంద్రం అయింది. ఇప్పటికే పలు కంపెనీలు దేశంలో తయారైన కార్లను విదేశాలకు తరలిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియన్ బ్రాండ్ కార్లను వినియోగించనున్నాయి.
నిస్సాన్ కంపెనీ ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన మాగ్నైట్ కార్లు 'లైఫ్ హ్యాండ్ డ్రైవ్' ఆప్షన్ కలిగి ఉంటాయి. ఎందుకంటే.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపయోగిస్తున్న కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్ పొందాయి. కాబట్టి మన దేశంలో ఎగుమతికి సిద్ధం చేసిన కార్లను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.
నిస్సాన్ మాగ్నైట్
ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.50 లక్షల మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూమరాంగ్ ఆకారపు డీఆర్ఎల్ వంటి వాటితో పాటు అప్డేటెడ్ గ్రిల్ కూడా ఈ కారులో చూడవచ్చు. ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందాయి.
ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
మాగ్నైట్‌లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్) లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (100 పీఎస్ పవర్, 160 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజన్స్ ఉన్నాయి. ఇవి రెండూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.
ఫేస్‌లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment