సాక్షి, హైదరాబాద్: - పద్నాలుగేళ్ల కుర్రాడు స్పోర్ట్స్ బైక్‌పై దూసుకుపోతుంటాడు.. - పదిహేడేళ్ల విద్యార్థి హైస్పీడ్ వాహనాన్ని నడిపేస్తుంటాడు.. ఇలాంటి దృశ్యాలు నగరంలోనూ.. శివారు ప్రాంతాల్లోనూ నిత్యం మనకు కనిపిస్తుంటాయి. ఇది కొందరికి సరదా అయితే మరికొందరికి అవసరం. ఏదిఏమైనా.. వీరు మైనర్లని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, వాహనం నడపకూడదని అందరికీ తెలుసు. అయినా అడ్డూఅదుపూ లేకుండా నగరంలో.. ప్రధానంగా ఓల్డ్‌సిటీలో మైనర్లు వాహనాలపై దూసుకుపోతూనే ఉన్నారు. వీరిని ఎవరూ పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యమే ఆదివారం బహదూర్‌పుర ప్రాంతంలో రియాజ్(12) ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఉన్న ప్రేమతో మైనార్టీ తీరకుండానే వాహనాలు కొనిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మైనర్లు యథేచ్ఛగా ‘దూసుకుపోతున్నారు’. ఫలితంగా పెనువిషాదాలతో కడుపుకోత మిగులుతోంది.
నిబంధనలు ఏం చెప్తున్నాయంటే..
భారత మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్ట్) ప్రకారం పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్లపైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు.
ఇతర దేశాల్లో అయితే..
కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు, యూత్ విజృంభిస్తున్నారనేది అధికారుల వాదన. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంపై బయటకు వస్తే వాహనం సీజ్ చేస్తారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. అక్కడ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే వారి లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఉన్న కొన్నింటినీ సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే.. అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఓ వాహనచోదకుడు ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడనే డేటా ఎక్కడా అందుబాటులో ఉండదు. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రవాణా శాఖ వద్ద లేదు. దీంతో ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఉల్లంఘించినా ఫైన్‌తో సరిపెట్టాల్సి వస్తోంది.
టీనేజర్లు.. టూవీలర్లు..
ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువ జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాతి స్థానం తేలికపాటి వాహనాలైన కార్లది. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహనచోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వాటికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకుంటున్న రేసింగ్స్ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి.
తల్లిదండ్రుల పాత్ర ఎంతో..
పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక యాంత్రిక జీవితం నేపథ్యంలో తల్లిదండ్రులకు ఉండట్లేదన్నది ట్రాఫిక్ పోలీసుల మాట. దీంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలకు మైనార్టీ తీరకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు కొని ఇస్తూ ‘ప్రేమను’ చాటుకుంటున్న తల్లిదండ్రులు పరోక్షంగా వారి విచ్చలవిడితనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment