కాలుష్యరహిత శ్మశానవాటిక
- రాష్ట్రంలోనే మొదటిది
- తిరుమలగిరిలో ప్రారంభం
బొల్లారం, న్యూస్‌లైన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలుష్య రహిత, పర్యావరణ అనుకూల శ్మశానవాటిక నగరంలో ఏర్పాటైంది. ప్రభుత్వ సహకారంతో రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ వాటిక.. సిటీలో తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని లీలా గార్డెన్ సమీపంలో ఆహ్లాదకర వాతావరణంలో రూపుదిద్దుకుంది. రెండున్నర ఎకరాల స్థలంలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ స్వర్గ్ వాటిక శుక్రవారం ప్రారంభమైంది.
పచ్చగా.. ఆహ్లాదంగా..
ఆత్మబంధువుల మృతితో దు:ఖంతో వచ్చేవారికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మానసిక ప్రశాంతతను కల్పించేందుకు పచ్చనిచెట్లు, తోటలు, వాటర్ ఫాల్స్, ఫౌంటెయిన్‌లను ఏర్పాటు చేశారు. శవాలను తీసుకువచ్చేందుకు ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు చితా భస్మాలను సేకరించుకునేందుకు ఒక ప్రత్యేక గది, మృతదేహలను భద్రపరిచేందుకు కోల్డ్‌స్టోర్ గదుల సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాదు.. ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్‌తో పాటు ఎలక్ట్రిక్ కరెంట్‌తో దహన సంస్కారాలను నిర్వహించే విధంగా ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలో దహనానంతరం ఏర్పడే కాలుష్యాన్ని నిర్మూలించడానికి పొల్యూషన్ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు.
వ్యర్థాలు, మలిన పదార్థాల వాసనను తొలగించేందకు 100 అడుగుల ఎత్తు పొగ గొట్టాన్ని నిర్మించారు. మొత్తంగా పర్యావర ణానికి మేలు చేసే విధంగా రూపొందిందీ శ్మశానవాటిక. ఇక్కడ దహన సంస్కారాలను చేపట్టేందుకు ఐడీ ప్రూఫ్‌తో రిజిస్టర్ చేసుకోవాలని ట్రస్ట్ ప్రతినిధి రంజన్ సూద్ తెలిపారు. దహన సంస్కారాలకు రూ. 3,000 నుంచి రూ. 3700 వరకు ఫీజు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆమోదంతో త్వరలో ఈ వాటిక నుంచే డెత్ సర్టిఫికెట్‌లను జారీ చేస్తామన్నారు.