కరెన్సీ కష్టాలకు చెక్
స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో మినీ బ్యాంక్ ఏర్పాటు
హుస్నాబాద్: నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను ఓ మహిళా సంఘం తీర్చి ఆదుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంకు సహకారంతో మినీబ్యాంకు ఏర్పాటు చేశారు. శనివారం బ్యాంకులు బంధ్ కావడంతో గ్రామస్తులు నగదు కోసం ఇక్కడ బారులుదీరారు.
స్వశక్తి మహిళలు పొదుపు, రుణాల చెల్లింపులను ఈ బ్యాంకు (స్వైపింగ్ మిషన్) ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మినీబ్యాంకు ద్వారా రూ.2 వేలు నగదు చెల్లిస్తున్నారు. ఈ విధానం పెద్దనోట్ల రద్దుకు ముందే ఉందని.. అయితే, ఇప్పుడు అది గ్రామస్తులకు బాగా ఉపయోగపడుతోందని సంఘం సీఏ కనకతార తెలిపారు.