దేవాదాయశాఖలో పదోన్నతుల గోల | Devadayasakha nodded promotion | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖలో పదోన్నతుల గోల

Published Mon, Nov 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

దేవాదాయశాఖలో పదోన్నతుల గోల

దేవాదాయశాఖలో పదోన్నతుల గోల

  • పోస్టులు లేకున్నా పదోన్నతులు.. ఆపై మళ్లీ ప్రమోషన్లు
  • అవన్నీ చెల్లవంటూ తాజాగా ట్రిబ్యునల్ తీర్పు
  • సాక్షి, హైదరాబాద్: ఉన్న పోస్టులు ఆరు.. పదోన్నతి కల్పించింది తొమ్మిది మందికి... కొన్నేళ్లుగా జరిగిన ఈ తంతు సరికాదంటూ ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు.. చిత్రమేమిటంటే ఆ పదోన్నతులు పొందినవారు ఈ కాలంలో మరోసారి కూడా పదోన్నతి పొందారు. వారిలో కొందరు రిటైరయ్యారు కూడా. ఇప్పుడు ఆ ఉద్యోగుల విషయంలో ఏం చేయాలి..!?.. దేవాదాయ శాఖ లో నెలకొన్న గందరగోళమిది.

    దేవాదాయ శాఖ ఆరో జోన్ పరిధిలో 2001 వరకు తొమ్మిది గ్రేడ్-1 కార్యనిర్వాహక అధికారుల(ఈవో) స్థాయి పోస్టులుండగా.. వాటిలో మూడింటి స్థాయిని పెంచి సహాయక కమిషనర్ పోస్టులుగా మార్చారు. దీంతో గ్రేడ్-1 ఈవో పోస్టుల సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. అయినా అప్పటినుంచి నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది మందికి పదోన్నతులు కల్పిస్తూ వచ్చారు.

    ఇలా అదనంగా పదోన్నతులు పొందుతూ వచ్చినవారిలో.. ఆరుగురు 2012లో సహాయక కమిషనర్లుగా మరో పదోన్నతి పొందారు. దీనితో అక్రమ పదోన్నతులపై వచ్చిన వారికి సహాయక కమిషర్లుగా ఎలా పదోన్నతి కల్పిస్తారంటూ మిగతా అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ వారి పదోన్నతులను సమీక్షించి ఆ ఆరుగురిని తిరిగి గ్రేడ్-1 ఈవోలుగా మార్చింది. దీనిపై ఆ ఆరుగురు రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వీరిలో నలుగురు  సహాయక కమిషనర్లుగా పదవీ విరమణ చేశారు.

    తాజాగా ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలించిన రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్... ఆ స్టేను తొలగిస్తూ.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. దీని ప్రకారం ఆ ఆరుగురి పదోన్నతులు చెల్లకుండా పోయాయి. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఆ ఇద్దరు సహాయక కమిషనర్లకు రివర్షన్ ఇవ్వాలని, పదవీ విరమణ చేసిన మిగతా నలుగురి బెనిఫిట్స్‌ను పునఃసమీక్షించాలని ఉన్నతాధికారులపై ఇతర అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. అడ్డగోలు పదోన్నతులు కల్పించిన ఉన్నతాధికారులు ఇప్పటికే పదవీ విరమణ చేయడం గమనార్హం.
     

Advertisement

పోల్

Advertisement