పారదర్శకథ కంచికేనా? | E Services Process Not Implemented In Agricultural Market Yards In Joint Medak District | Sakshi
Sakshi News home page

పారదర్శకథ కంచికేనా?

Published Wed, Sep 11 2019 8:34 AM | Last Updated on Wed, Sep 11 2019 8:34 AM

E Services Process Not Implemented In Agricultural Market Yards In Joint Medak District - Sakshi

సిద్దిపేట మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాల దృశ్యం(ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ – సర్వీసెస్‌ ప్రక్రియ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో జీరోదందాకు అడ్డుకట్ట పడటం లేదు. మార్కె ట్‌ యార్డుల్లో ఈ – సర్వీసెస్‌ ప్రక్రియను అమలు చేస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లో ట్రేడర్, కమీషన్‌ ఏజెంట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల అప్‌లోడింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా మార్కెటింగ్‌ శాఖ పరిధిలోకి సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, చేర్యాల, హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ, కొండపాక, తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, వంటిమామిడి కలుపుకొని మొత్తం 14 ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.

వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కందులు పెద్ద ఎత్తున మార్కెట్‌కు వస్తాయి. గజ్వేల్‌లో పత్తి, మక్క, వరి, శనిగలు, హుస్నాబాద్‌లో వరి, మక్క, పత్తి ఉత్పత్తులు ప్రధానంగా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ లెక్కన 14 యార్డుల్లో 2018 – 19 ఖరీఫ్‌ సీజన్‌లో రూ.240కోట్ల విలువైన ధాన్యం క్రయవిక్రయాలు జరిగాయి. రబీ సీజన్‌లో రూ.121కోట్ల విలువైన ధాన్యం అమ్మకాలు జరిగాయి. ఖరీఫ్‌లో 87కోట్ల విలువలైన మక్క, 17కోట్ల విలువైన కందుల అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వానికి 2018 – 19 సీజన్‌లో ధాన్యం క్రయవిక్రయాలకు రూ.2.45కోట్లు మార్కెట్‌ ఫీజు రూపంలో ఆదాయం రాగా, రబీలో రూ. 1.21కోట్లు వచ్చింది. మక్కలకు సంబంధించి రూ.87లక్షలు, కందులకు రూ.17లక్షలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సుమారు రూ.5కోట్ల వరకు మార్కెటింగ్‌ ఫీజు రూపంలో ఆదాయం వచ్చింది. 

అడుగు పడితే..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ – సర్వీసెస్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం దశల వారీగా ఆయా జిల్లాల్లో ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 40కి పైగా మార్కెట్‌ యార్డుల్లో ఈ – సర్వీసెస్‌ సేవలు లేకపోవడం విశేషం. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని 14 మార్కెట్‌ కమిటీల్లో ప్రస్తుతం మాన్యువల్‌ ద్వారానే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో వాస్తవ లెక్కలకు పొంతన లేకుండా ఆదాయం తగ్గిపోతోంది. ప్రధానంగా ట్రేడర్లు యార్డుల్లో ధాన్యం నిల్వలను, అమ్మకాలను మాన్యువల్‌ ప్రక్రియతో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఈ – సర్వీసెస్‌తో పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో మాన్యువల్‌ పద్ధతి కొనసాగుతుండటంతో చెక్‌పోస్టుల్లో రవాణాకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సిద్దిపేట, గజ్వేల్‌ మార్కెట్‌ యార్డుల్లో ఈనామ్‌ పద్ధతిని అమలు చేయడంతో ప్రస్తుతం జిల్లాలోని రెండు మార్కెట్‌యార్డుల్లో మాత్రమే ఈనామ్‌ వ్యవస్థ అమలవుతోంది. 

దశల వారీగా ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా, దశల వారిగా ఈ – సర్వీసెస్‌ను అమలు చేస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో ప్రస్తుతం ప్రక్రియ అమలు జరగడం లేదు. సిద్దిపేట జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల పరిధిలోని ట్రేడర్‌లు, కమీషన్‌ ఏజంట్ల వివరాలను, అవసరమైన ధ్రువీకరణ పత్రాల సేకరణలో నిమగ్నమై ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. ఈ – సర్వీసెస్‌ ప్రక్రియ అమలైతే పారదర్శకత పెరిగి అక్రమాలు కట్టడి అవుతాయి.
– నాగరాజు, జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఏడీ

ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాల నమోదు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ఈ –సర్వీసెస్‌ అమలును చేపట్టిన సంబంధిత శాఖ అధికారులు ప్రస్తుతం ట్రేడర్‌ల, కమీషన్‌ ఏజెంట్ల ధ్రువీకరణ పత్రాల సేకరణకే పరిమితం కావడం విశేషం. మార్కెట్ల వారీగా ట్రేడర్‌లు,  కమీషన్‌ ఏజంట్ల వివరాలు, ఈమెయిల్‌ ఐడీలు, ఆధార్‌కార్డులు, లైసెన్స్‌ ధ్రువీకరణ పత్రాలు, సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత పూర్తి వివరాలను సేకరించిన అనంతరం వాటిని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు అనుసంధానం చేయాలి. పూర్తి స్థాయిలో వివరాల నమోదు అనంతరం ఈ – సర్వీసెస్‌ ప్రక్రియను అమలు చేస్తూ ట్రేడర్‌ల వారీగా లైసెన్సింగ్, క్రయవిక్రయాలు, ట్రేడర్‌ల వద్ద నిల్వలు, మార్కెట్‌ ఫీజు చెల్లింపు తదితర అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల పరిధిలో 279 మంది ట్రేడర్‌ల వివరాలు, 143 మంది కమీషన్‌ ఏజెట్ల వివరాలను మాత్రమే నమోదు చేసిన మార్కెట్‌ శాఖ మరో అడుగు ముందుకు వేస్తే జిల్లాలో ఈ – సర్వీసెస్‌ లక్ష్యం పూర్తవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement