నేతలనే ముంచేశాడు! | Fake Finance Secretary cheats Telugu states MLA's : T TDP | Sakshi
Sakshi News home page

నేతలనే ముంచేశాడు!

Published Tue, Jun 6 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

నేతలనే ముంచేశాడు!

నేతలనే ముంచేశాడు!

ప్రభుత్వ అధికారినంటూ పథకాల పేర్లతో ఫోన్లు
రుణాలు ఇప్పిస్తామంటూ అందినకాడికి స్వాహా
టీడీపీ నేత రేవంత్‌రెడ్డి పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు
పాత నేరస్తుడిని పట్టుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు


హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారిననో... ఆర్థిక శాఖలో ఉన్నతాధికారననో... కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగిననో... ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేస్తాడు. వివిధ రకాలైన పథకాల పేర్లు చెప్పి వారిని బుట్టలో వేసుకుంటాడు. పథకం గడువు ముగుస్తుందని, ‘స్పందిస్తే’ నియోజక వర్గంలోని ప్రజలకు రుణాలు ఇప్పిస్తానని అంటాడు. ఖర్చుల కోసమంటూ అందినకా డికి నగదు తన బ్యాంకు ఖాతాలో వేయించు కుని ఆపై సైలెంటైపోతాడు. ఈ పంథాలో రెచ్చిపోతున్న తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రూ.90 వేలు గుంజా డు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహల్స్‌ పోలీసులు నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

పీడీ యాక్ట్‌ ప్రయోగించినా...
తూర్పుగోదావరి జిల్లా చిర్లంకిపాడు గ్రామానికి చెందిన తోట బాలాజీనాయుడు అలియాస్‌ మనోహర్‌ (38) కొన్నాళ్లు రామగుండంలోని ఎన్టీపీసీలో పనిచేశాడు. అనేక ఆరోపణల నేపథ్యంలో 2008లో ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధులే టార్గెట్‌గా మోసాలు చేయడం ప్రారంభించాడు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారినంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం... ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి వాటి గడువు ముగుస్తోందని, స్పందిస్తే మీ నియోజక వర్గంలో ఉన్న ఓటర్లకు ఎక్కువ రుణాలు, సహాయం వచ్చేలా చూస్తానంటూ నమ్మించడం అతడి దైనందిన చర్య. దీనికి అంగీకరించిన వారి నుంచి ఖర్చుల కోసమంటూ రూ.25వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తాడు.

 ఆపై వారిని సంప్రదించిన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి సైడైపోతాడు. ఈ రకంగా గతంలో టాస్క్‌ ఫోర్స్‌తో పాటు మల్కాజ్‌గిరి పోలీసులకు చిక్కాడు. గత ఏడాది ఓ ప్రజా ప్రతినిధిని ఇదే పంథాలో మోసం చేసిన కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా మోసాలకు పాల్పడుతున్నాడనే కారణంగా బాలాజీ నాయుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. దీంతో ఏడాది పాటు జైల్లో ఉన్న ఇతగాడు గత నెలలో విడుదలయ్యాడు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ...
అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ సామాజిక వర్గాల వారికి ప్రధాన మంత్రి కృషి యోజన పథకం కింద రుణాలు ఇప్పిస్తానని రేవంత్‌రెడ్డికి బాలాజీ ఫోన్‌ చేసినట్టు తెలిసింది. గొంతు మార్చిన బాలాజీ... తాను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీనంటూ పరిచయం చేసుకున్నాడు. సదరు పథకంలో భాగంగా రూ.2 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీనికి కొంత మొత్తం ఖర్చవుతుందని, ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాలో వేయాల్సిందిగా తెలిపాడు. దీంతో బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు డిపాజిట్‌ అయ్యాయి. అయితే సరదు పథకం గడువు ఎప్పుడో ముగిసిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న రేవంత్‌రెడ్డి... తన వ్యక్తిగత కార్యదర్శి నగేష్‌ ద్వారా జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం వలపన్ని బాలాజీనాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని..
రేవంత్‌రెడ్డి పీఏ ఇచ్చిన ఫిర్యాదు మినహా మరే ఫిర్యాదులూ ఇప్పటి వరకు అందలేదని జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు మూడుసార్లు అరెస్టు అయిన బాలాజీ చేతిలో దాదాపు 30 మంది వరకు ప్రజాప్రతినిధులు మోసపోయి నట్లు తెలుస్తోంది. 2015లో రూ. 90 వేలు మోసపోయిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి ఇతడిపై ఫిర్యాదు చేశారు. అయితే అనేకమంది ఎంపీలు, ఎమ్మె ల్యేలు బాలాజీ నాయుడి చేతిలో మోస పోయినా... పరువు పోతుందనే ఉద్దే శంతో వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదని తెలుస్తోంది.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement