బెంజ్ యాజమాన్యానికి పోలీసుల లేఖ
సందేహాలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున మెర్సిడస్ బెంజ్ కారు అతివేగంగా వెళ్తూ మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మెర్సిడస్ బెంజ్ ఇంపోర్టెడ్ జి– 63 మోడల్ కారుకు సంబంధించి పోలీసులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న మెర్సిడస్ బెంజ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పోలీసులు ఈ లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్‌బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి.. నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి.. అన్న సందేహాలను లేవనెత్తారు. మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా..? అని ప్రశ్నించారు. స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి.. ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయో తెలపాల్సిందిగా కోరారు. సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా కోరారు.