అప్పుడు వాహన వేగం 146 కి.మీ.
♦ నిషిత్ నారాయణ ప్రమాదంపై ట్రాఫిక్ బృందం అధ్యయనం
♦ మెట్రో పిల్లర్స్‌పై జీహెచ్‌ఎంసీతో కలసి స్టడీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఈ నెల 10న జరిగిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పి.నిషిత్ రోడ్డు ప్రమాదాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో నిషిత్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మరణించిన విషయం విదితమే. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని నిర్థారించినప్పటికీ... ఆ సమయంలో వాహన వేగం ఎంత అనేది ట్రాఫిక్ పోలీసులు గుర్తించలేదు. సీసీ ఫుటేజ్‌ను సాంకేతికంగా అధ్యయనం చేసిన అధికారులు నిషిత్ వాహనం గంటకు 146 కి.మీ. వేగంతో ఉన్నట్లు నిర్థారించారు.
అయితే ప్రమాదం తర్వాత ఇంజన్ రైజ్ స్పీడో మీటర్ 205 కి.మీ. వద్ద లాక్ అయినట్లు భావిస్తున్నారు. సిటీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ప్రతాప్, నర్సింగ్‌రావుతో కూడిన బృందం ఘటనాస్థలంలో అధ్యయనం చేసింది. ఒక సెకను సీసీ కెమెరా ఫీడ్‌ను ఫొటోలుగా (ఫ్రేమ్స్) విభజిస్తే 24 ఫ్రేమ్స్ వస్తాయి. అయితే నిషిత్ ప్రమాదానికి సంబంధించి వాహనం కేవలం 4 ఫ్రేమ్స్‌లోనే చిక్కింది. దీనికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు చెప్తున్నారు. నిషిత్ నారాయణ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా ఉన్న మెట్రో పిల్లర్లను అధ్యయనం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం మొదలెట్టిన ఈ స్టడీ శనివారం కూడా జరుగనుంది. ఏఏ ప్రాంతాల్లో పిల్లర్లు ప్రమాదకరంగా ఉన్నాయో ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ నివేదికను జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ అథారిటీలకు అందించనున్నామని ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రాథమికంగా అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేయిస్తున్నారు.