అక్కడ ఎందుకలా జరిగింది..!
♦ నిషిత్ ప్రమాదంతో కదిలిన పోలీసు యంత్రాంగం
♦ ప్రమాదాల కారణాలపై లోతైన విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బుధవారం మెట్రో రైలు పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా ప్రాణా లు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో వాహనం గంటకు 205 కి.మీ వేగంతో ప్రయా ణిస్తోంది. ఈ అతి వేగమే ప్రమాదానికి కారణ మని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేవలం అదొక్కటే కారణం కాకపోతే... ఇలాంటి ప్రమాదాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి.
బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద గత ఏడాది జరిగిన చిన్నారి రమ్య ఉదంతం సంచలనం సృష్టిం చింది. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కార ణం ఎదుటి వాహన చోదకుడు మద్యం మత్తు లో మితిమీరిన వేగంతో దూసుకురావడమే అని భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయని, రోడ్ ఇంజనీరింగ్‌లో లోపాలు కీలక కారణమని నిర్థారించారు.
సాధారణంగా రహదారిపై ఏ ప్రమాదం జరిగినా... పెద్ద వాహనం నిర్లక్ష్యంగా, అతివేగంగా దూసుకువచ్చి చిన్న వాహనాన్ని ఢీ కొట్టిందంటూ పోలీసులు ‘నిగ్గు తేల్చేస్తారు’. యాక్సిడెంట్ కేసుల్లో సరైన, పూర్తి స్థాయి దర్యాప్తు లేని కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా నగరంలోని అనేక రహదారులపై ఉన్న ‘బ్లాక్ స్పాట్స్’వెలుగులోకి రాక నిత్యం ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్ని మార్చాలని నిర్ణయించిన నగర పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదాలపై దర్యాప్తును బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం కీలక కేసుల దర్యాప్తులో శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీసుల్నీ భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నారు.
‘బ్లాక్‌స్పాట్స్’పైనా సమగ్ర అధ్యయనం...
నగర వ్యాప్తంగా 80కి పైగా బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గడిచిన మూడేళ్లలో ఓ ప్రాంతంలో చోటు చేసుకున్న ప్రమాదాల గణాంకాల ఆధారంగా వీటిని కనుగొన్నారు. ఇతర విభాగాలతో కలసి ఉమ్మడి పర్యటనలు చేయడం ద్వారా ఈ స్పాట్స్‌లో అసలు కారణాలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలు నిర్దేశించడం, వీటిని అమలు చేయాల్సిందిగా సంబంధిత విభాగాలను కోరడంతో పాటు పని తీరును పర్యవేక్షించడం తప్పనిసరి చేస్తున్నారు.
దర్యాప్తులో ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యం!
నగరంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే... దానిపై పూర్తి స్థాయి దర్యాప్తు శాంతిభద్రతల విభాగం చేతిలోనే ఉంటుంది. దీనివల్ల అనేక క్షేత్ర స్థాయి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రమాదాల కేసుల దర్యాప్తులో ట్రాఫిక్ పోలీసులనూ భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నారు. అయితే సిబ్బంది సంఖ్య నేపథ్యంలో ప్రతి కేసులోనూ కాకపోయినా... కీలక కేసుల్లో మాత్రం వీరి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఘటనా స్థలిని పరిశీలించిన రవాణా అధికారులు...
నిషిత్ నారాయణ ప్రమాద స్థలిని గురువారం రవాణా శాఖాధి కారులు పరిశీలించారు. ఎంవీఐ జి.సాయిరాం రెడ్డి, మాజీ రవాణాశాఖాధికారి జి.విజయ్‌పాల్‌రెడ్డి అక్కడ ప్రమాద కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. వాహనం ఎటు నుంచి ఎంత వేగంతో వచ్చింది? ఇక్కడే ఎందుకు ప్రమాదానికి గురైంది? మెట్రో పిల్లర్‌కు రేడియం స్టిక్కర్లు వేశారా? లేదా? అనేది పరిశీ లించారు. మలుపు వద్ద హెచ్చరిక, సూచీ బోర్డులు లేకపో వడాన్ని గుర్తించారు. నిషిత్ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాం తాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సమగ్ర సర్వే చేసి సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు.