![Delhi Police Arrested Person For Criminal Activities doing In Metro Cities - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/19/criminal-arrest.jpg.webp?itok=Qi9NSNmY)
సాక్షి, సిటీబ్యూరో: అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన శర్థక్ రావు బబ్రాస్ దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరాడు. స్టార్ హోటల్స్ అడ్డాగా చేసుకుని కథ నడిపిన ఇతగాడిని ఢిల్లీ పోలీసులు పదేళ్లకు పట్టుకోగలిగారు. బసేర హోటల్‌లో బస చేసి, అమర్సన్స్ పెరల్స్ అండ్ జ్యువెల్స్ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై ఇతడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం విదితమే.
‘డు నాట్ డిస్ట్రబ్’ అంటూ...
పోర్ట్ బ్లేయర్‌లోని ఎంజీ రోడ్ ప్రాంతానికి చెందిన శర్థక్ రావు బబ్రాస్ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్ళకు వెళ్లే ఇతగాడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. బోగస్ ధ్రువపత్రాలు ఇచ్చి గదిలో దిగుతాడు. కనీసం వారు రోజుల పాటు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బస చేస్తాడు. ఎవరైనా అడిగితే... తాను విమానంలో వచ్చానని, తన సహాయకులు రైలు లేదా రోడ్డు మార్గంలో వస్తున్నారని, నగదుతో పాటు లగేజ్ వారి వద్దే ఉండిపోయిందని చెప్పి కాలం గడుపుతాడు.
హోటల్ సిబ్బంది నుంచి ఒత్తిడి పెరుగుతోందని భావిస్తే తన గది బయట ‘డు నాట్ డిస్ట్రబ్’ బోర్డు తగిలిస్తాడు. సదరు కస్టమర్లను నేరుగా, ఫోన్ ద్వారా కూడా డిస్ట్రబ్ చేయకపోవడం హోటళ్ల పాలసీ కావడం ఇతడికి కలిసి వచ్చింది. ఆపై అదును చూసుకుని ఆ హోటల్ ట్రావెల్ డెస్క్ నుంచే టిక్కెట్ బుక్ చేయించుకుని ఉడాయిస్తాడు. ఈ పంథాలో 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా పోలీసులకు చిక్కలేదు.
బెడిసికొట్టిన ‘కంఫర్ట్ ఇన్’ ప్రయత్నం..
ఇలా పదేళ్ల పాటు రెచ్చిపోయిన శర్థక్ అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఏ పోలీసులకూ తెలియలేదు. 2012లో ఢిల్లీలోని కంఫర్ట్ ఇన్‌లో దిగిన అతను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా అధికారినని, తన పేరు లోహానీగా చెప్పుకున్నాడు. తన వారు వస్తారనే, డు నాట్ డిస్ట్రబ్ అని బోర్డు పెట్టే ప్రయత్నాలన్నీ ముగిసే సరికి హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ నుంచి అతడు ఎక్కడెక్కడికి కాల్స్ చేశాడో ఆరా తీయగా, ముంబై, భోపాల్, కోల్‌కతాలతో పాటు పోర్ట్ బ్లేయర్‌కూ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు.
దీంతో కోల్‌కతాకు చెందిన ఓ నెంబర్‌ను సంప్రదించగా... అతడు ట్రావెల్ ఏజెంట్‌గా తేలింది. లోహానీ తనకూ డబ్బు ఇవ్వాలని వారు చెప్పడంతో వీరి అనుమానాలు బలపడ్డాయి. దీంతో డబ్బు చెల్లిస్తే తప్ప హోటల్ రూమ్ వదిలి వెళ్లనివ్వమని నిర్భంధించారు. ఆర్మీలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్న తన స్నేహితులు అమిత్, వినీత్ వస్తున్నారని.. వారే డబ్బు కడతారన్నా హోటల్ యాజమాన్యం బయటకు వెళ్ళేందుకు అంగీకరించలేదు.
గుట్టు విప్పిన శర్థక్ భార్య కవిత..
హోటల్ బకాయిలు పెరిగిపోవడంతో సిబ్బంది లోహానీగా చెప్పుకున్న శర్థక్ సెల్‌ఫోన్ లాక్కున్నారు. అందులో అతడు కాల్స్ చేసిన నెంబర్లు పరిశీలించగా... ఓ నెంబర్‌తో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. హోటల్ యాజమాన్యం సైతం ఆ నెంబర్‌కు ఫోన్ చేయడంతో కవిత అనే మహిళ మాట్లాడారు. ఈ ఫోన్ నెంబర్ తన మాజీ భర్తదని, అతడు పచ్చి మోసగాడని, అందుకే వదిలేసి దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. అతడి పేరు శర్థక్ రావు బబ్రాస్‌గా వెల్లడించింది. దీన్ని నిరూపించడం కోసం కొన్ని సర్టిఫికెట్లు సైతం హోటల్‌కు ఫ్యాక్స్ చేసింది. దీంతో హోటల్ సిబ్బంది అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
విచారణ నేపథ్యంలో అప్పటికే దాదాపు పదేళ్ళుగా తాను న్యూ ఢిల్లీలోని ఓబెరాయ్, రాడిస్సన్, మౌర్య షెరిటాన్, హయత్ రీజెన్సీ, సెంచూరీ, కోల్‌కతాలోని తాజ్ బెంగాల్, నోయిడాలోని హోటల్ ఫార్చూన్, లక్నోలోని తాజ్ హోటల్ తదితర చోట్ల బస చేసి మోసాలు చేసినట్లు బయటపెట్టాడు. తాజాగా శర్థక్‌ను అరెస్టు చేసిన గోపాలపురం పోలీసుల ఇతడిపై ఆయా నగరాల్లో నా న్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉం టాయని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని నగరాలకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment