యాకుత్‌పురా (హైదరాబాద్ సిటీ) : నకిలీ పోలీసులు స్వర్ణకారుడి దృష్టి మళ్లించి 2.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ యాదగిరిరెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రామాచారి (49) స్వర్ణకారుడు. బంగారు ఆభరణాలపై డిజైన్‌లు వేయించేందుకు రోజూ గుల్జార్‌హౌస్ కాలికమాన్ వస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుల్జార్‌హౌస్ ప్రాంతంలోని ఇరానీ కేఫ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేస్తున్నట్టు నటించి 2.5 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత గొలుసు చోరీ అయిన విషయం గమనించిన రామాచారి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన నగను డిజైన్ మోడల్ చూపించేందుకు తీసుకొచ్చానని బాధితుడు తెలిపాడు. బ్యాగ్‌లో ఉన్న రూ. 12 వేలు, మరో 4 గ్రాముల బంగారాన్ని దుండగులు వదిలేశారని చెప్పాడు. ఘటనా స్థలంలోని వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే గుల్జార్‌హౌస్, కాలికమాన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.