నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్
డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఎన్డీఎస్‌ఎల్ క్రషింగ్
నష్టాలు తప్పవంటున్న రైతులు
రోజురోజుకు తగ్గిపోతున్న చెరకు పంట
మెదక్: అదనుక నుగుణంగా పంట... సమయానుకూలంగా కోతలు చేపడితేనే ఏ రైతుకైనా ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయి. కానీ యజమాన్యం అలసత్వం.. ప్రభుత్వ, ప్రైవేట్ వివాదం.. ఫలితంగా మంభోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్‌ఎల్) ఫ్యాక్టరీ నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభిస్తోంది. దీంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆశిం చిన స్థాయిలో లాభాలు రాక, సమయానుకూలంగా బిల్లులు అందక, కూలీల కొరత, కరెంట్ కోతలు వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలు పదేళ్ల నుంచీ చెరకు సాగును తగ్గిస్తూ వస్తున్నారు.
మెతుకుసీమలోనే 12 మండలాల చెరుకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ సుమారు 4 వేల మంది రైతులకు ఆశించిన మేర సేవలందించింది. రానురానూ అనేక సమస్యలతో ఫ్యాక్టరీని కొంతభాగం ప్రైవేట్ భాగస్వాములకు అమ్మేశారు. ఈ ఏడాది తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునే యోచనలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేసింది. ఇదే సమయంలో జిల్లాలోని ఇతర చెరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా నవంబర్ నెలలో క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించాయి. కానీ మెదక్ ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం డిసెంబర్ మొదటివారంలో క్రషింగ్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యమైతే అంతే..
మెదక్ ప్రాంతంలో పదినెలల కాలాన్ని నిర్ణయించుకుని నవంబర్‌లో చెరకు పంటనే వేస్తారు. ఈ మేరకు మరుసటి ఏడాది సెప్టెంబర్‌లోపు క్రషింగ్ చేపట్టాలి. కానీ గత ఏడాది రెండు నెలలు ఆలస్యంగా ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం నవంబర్‌నెలలో క్రషింగ్ ప్రారంభించింది. ఈసారి కనీసం నవంబర్ నెలలోనే ప్రారంభించినా అప్పటికే పంట 12 నెలల కాలం దాటిపోతుంది. డిసెంబర్‌లో ప్రారంభిస్తే 13 నెలలు పడుతుంది. దీంతో చెరకు ఎండిపోయి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికే వర్షాలు లేక కరెంట్ కోతలతో చెరుకు పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 50 రోజులపాటు పంటను కాపాడాలంటే తలకు మించిన భారమవుతుంద ంటున్నారు. అలాగే చెరుకు పంట నరికిన తర్వాత రబీలో పంటలు వేసుకోవాలంటే సమయం దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు క్రషింగ్ పూర్తయ్యే సరికి ఫిబ్రవరి నెల దాటిపోతుందని ఆ సమయంలో ఏ పంటలు వేసుకోలేని పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. చెరుకు నరకడం ఆలస్యమవుతుంటే కూలీల రేట్లు కూడా పెరిగి పోతాయని చెబుతున్నారు.
తగ్గుతున్న చెరకు సాగు
మంజీరా తీరంలో రోజురోజుకూ చెరుకు పంట సాగు తగ్గిపోతోంది. కరెంట్ కోతలు, కూలీల ఇబ్బందులు, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష ్యం, పెట్టుబడులకనుగుణంగా దిగుబడులు రాక రైతులు చెర కు సాగుకు స్వస్తి చెబుతున్నారు. 2006లో మంభోజిపల్లి ఎన్డీఎస్‌ఎల్‌లో 3,84, 000 టన్నుల చెరకు క్రషింగ్ అయ్యింది. అయితే అది గత ఏడాది 1,52,000 టన్నులకు తగ్గిపో గా, ఈసారి 1,37,000 టన్నులకు పడిపోయిం ది. ఫ్యాక్టరీలో రోజుకు 2,500 టన్నుల చెరకు క్రషింగ్ చేసే అవకాశం ఉంది.
అయినప్పటికీ మొరాయిస్తున్న యంత్రాలు, విద్యుత్ సమస్యలు తదితర కారణాల వల్ల తరచుగా ఫ్యాక్టరీలో క్రషింగ్ ఆగిపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఒక్కోసారి నాలుగైదు రోజు లపాటు తమ చెరకు పంట ఎండలో ఎండుతుండటంతో తూకంలో భారీగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. యాజమాన్యాలు ఇస్తున్న ధర కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నామని తెలిపారు.