ఆర్టీసీ సమ్మె: మీరేమైనా బ్రిటిష్‌ పాలనలో ఉన్నారా? | High Court Suggestions To Govt And RTC Employees | Sakshi
Sakshi News home page

చర్చించుకోండి!

Published Wed, Oct 16 2019 2:07 AM | Last Updated on Wed, Oct 16 2019 8:23 AM

High Court Suggestions To Govt And RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరేమైనా బ్రిటిష్‌ పాలనలో ఉన్నారా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆట జరుగుతోందా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగించినా, సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని హైకోర్టు పరోక్షంగా ఆర్టీసీ జేఏసీని హెచ్చరించింది. సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే సమ్మె విరమించేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల సాధనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌.సుబేందర్‌సింగ్‌ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా ఇరుపక్షాలకు పలు సూచనలు చేసింది.

ఇబ్బంది లేదని ఎలా చెబుతారు..? 
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేయబోదని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తాయన్నారు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై లేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో.. ఇంకా 4 వేల బస్సులు నడపట్లేదని, మిగిలిన 6 వేల బస్సులు నడుస్తున్నాయని పేర్కొనడాన్ని హైకోర్టు ఎత్తి చూపింది. 4 వేల బస్సులు నడపకుండానే ప్రయాణికులు ఇబ్బందులు పడట్లేదంటే ఎలా అని ప్రశ్నించింది. మరి ఇబ్బందులు లేనప్పుడు విద్యాసంస్థలకు దసరా సెలవులు ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది. కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. యూనియన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, కార్మికులు తమ సమస్యలను ఎవరి ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీకి ఎండీని నియమించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అదనపు ఏజీ చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భుత్వంలో ఎంతో మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటారని, వారిలో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించేందుకు వ్యవధి కావాలనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం చేయకపోవడం వల్లే లోకాయుక్తను నియమించాలని, శిశు సంక్షేమ జిల్లా కమిటీలను నియమించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

గత్యంతరం లేకే సమ్మె.. 
సమ్మె చేసిన కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడాన్ని ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చాక చర్చలు జరుపుతామని చెప్పి అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదా వేశారని, గత్యంతరం లేకే సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడే సమ్మె చేస్తారని, ప్రభుత్వం చర్చలు జరకుండా ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసికి చెందిన రూ.545 కోట్లను ప్రభుత్వం మళ్లించిందని, పీఎఫ్‌ సొమ్ము, ఇతర సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డి చెప్పారు. ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ నియమించి, అర్ధంతరంగా రద్దు చేసిందని, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. కాగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. సమ్మె విరమించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం సమర్థుడైన అధికారి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, సమస్య జఠిలం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

జీతం ఇవ్వాలని రిట్‌ 
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్‌ మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చింది. దీన్ని హైకోర్టు బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని, వాటిని నిలుపుదల చేసే అధికారం ఆర్టీసీ యాజమాన్యానికి లేదని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. ఆర్టీసీ సమ్మెపై ధర్మాసనం విచారణ జరుగుతోందని, కాబట్టి ఈ రిట్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

సెలవుల పొడిగింపుపై రిట్‌.. 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవుల్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలైంది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన రిట్‌లో వెంటనే విద్యాసంస్థలు తెరిచేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 
   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement