ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశం | High Court Warns To RTC To Solve The Problem Over Strike | Sakshi
Sakshi News home page

ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశం

Published Sat, Oct 19 2019 1:50 AM | Last Updated on Sat, Oct 19 2019 8:17 AM

High Court Warns To RTC To Solve The Problem Over Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇన్‌చార్జి)ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ), ఆర్టీసీ తెలం గాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా సమ్మె పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత సూచనలు... ఆపై ఉత్తర్వులు
ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌. సుబేందర్‌సింగ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు మరో మూడు రిట్లను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. మధ్యాహ్నం 2:15 గంటల నుంచి కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా అరగంటపాటు 4:45 గంటల వరకూ వాదనలు జరిగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో వాదనల సమయంలో ప్రభుత్వానికి సూచనలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు ధర్మాసనం ఆర్టీసీ ఎండీ (ఇన్‌చార్జి) చర్చలకు శ్రీకారం చుట్టాలని ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వానిది తండ్రి పాత్ర...ఈ అంశంపై తొలుత ఆర్టీసీ యాజమాన్యం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదించేందుకు నిలబడగానే ధర్మాసనం కల్పించుకొని ఆర్టీసీకి ఎండీని నియమించారా అని ప్రశ్నించింది. దీనికి ఏఏజీ బదులిస్తూ ఇంకా లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వ్యక్తిని ఎండీగా నియమిస్తే సమస్యల్ని అవగాహన చేసుకోవడం కష్టమవుతుందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఎండీని నియమిస్తే కార్మికులకు నమ్మకం ఏర్పడుతుందని, ఎండీ నియామకంతో జీతభత్యాలేమీ మీ జేబులోంచి ఇవ్వరు కదా? అని వ్యాఖ్యానించింది. కొత్త ఎండీని నియమిస్తే ఇప్పుడున్న ఇన్‌చార్జి ఎండీ సహకరించవచ్చు కదా, ప్రభుత్వానికి అధికారాలు ఉండేకొద్దీ మరింత వినయంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానిది తండ్రి లాంటి పాత్ర అని, ఉద్యోగులు పిల్లలని, ఒక కుటుంబంలో సభ్యులు ఏమైనా డిమాండ్లు లేదా సమస్యల్ని తీసుకొస్తే కుటుంబ పెద్ద చర్చించి పరిష్కరించాలని, ఆర్టీసీ సమ్మె విషయంలో అదే చేయాలని హితవు పలికింది. ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన పాత్ర కూడా ఉందని, అధికారాలతోపాటు బాధ్యతలను కూడా నెరవేర్చేది ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది.

కొత్త సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఉందా?
ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బస్సుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడంతో విద్యార్థులు సమస్యల్లో ఉన్నారని ధర్మాసనం పేర్కొనగా ఏఏజీ కల్పించుకొని ఇప్పటికే 87 శాతం బస్సులు తిరుగుతున్నాయన్నారు. సోమవారం (21వ తేదీ) నుంచి విద్యాసంస్థలన్నీ ప్రారంభమవుతాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘నిజమే.. ఆర్టీసీలో 100 కాదు 110 శాతం మంది సిబ్బందిని తీసుకొని సమ్మె ప్రభావం లేదని తేల్చినా రేపు ఈ సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఏముంది?’’అని ప్రశ్నించింది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఏఏజీ పేర్కొనగా ప్రభుత్వ నిధుల దుబారాపై ఇదే హైకోర్టుకు కేసులు వచ్చాయని గుర్తుచేసింది. అయితే తాను చెబుతున్న ఆర్థిక గడ్డు పరిస్థితి ఆర్టీసీ గురించి అని, తాను ప్రభుత్వం తరఫున వాదించడం లేదని, ఆర్టీసీ యాజమాన్యం తరఫున వాదిస్తున్నానని ఏఏజీ వివరణ ఇచ్చారు.

ప్రజాగ్రహం పెరగకుండా చూడండి..
సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించగా చర్చలు విఫలమైనట్లుగా 5వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిందని, చట్ట ప్రకారం చర్చలు విఫలమయ్యాక తిరిగి చర్చలకు వీల్లేదని ఏఏజీ బదులిచ్చారు. సమస్యను కార్మిక వివాదాల పరిష్కార అధీకృత అధికారి వద్దే పరిష్కరించుకోవాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘రేపు లేబర్‌ కోర్టు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని తేలిస్తే ప్రభుత్వం లేదా కార్పొరేషన్‌ ఏం చేస్తుంది? శనివారం తెలంగాణ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాబ్‌ డ్రైవర్లు, టీఎన్జీవో సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి’’అని గుర్తుచేసింది. అయితే సమ్మెపై రాజకీయాలు మొదలు పెట్టారని ఏఏజీ వ్యాఖ్యానించగా ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుంటూ ‘‘ఇప్పటికే అగ్గి మొదలైంది. అది రాజుకోకుండా చూడాలి. నియంత్రణ చర్యలు చేపట్టాలని పదేపదే హితవు చెబుతున్నాం. రాష్ట్రం చూడదని ఏఏజీ చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె వంటి చిన్న సమస్య మొదలై రెండు వారాలైంది. ప్రజాగ్రహం రాష్ట్రవ్యాప్తమైతే ఏం చేస్తారు? పౌర సమాజం గొంతు విప్పితే ఎవ్వరూ ఆపలేరు. ఫిలిపిన్స్‌లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనం. ప్రజాఉద్యమం ప్రజాగ్రహంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. హైకోర్టు ఉద్దేశం కూడా అదే. అందుకే ఆచితూచి స్పందిస్తున్నాం’’అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించాలని ధర్మాసనం సూచించగా ఏఏజీ కల్పించుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయని, ఈ డిమాండ్‌ సంగతి తేలిస్తేనే ఇతర డిమాండ్లలోకి వెళ్తామని షరతు విధించాయన్నారు.

సగం డిమాండ్లు పరిష్కరించేవే.. 
ఈ సందర్భంగా ధర్మాసనం ఐదు నిమిషాలకుపైగా కార్మికుల డిమాండ్లను చదివింది. ఒక్కో డిమాండ్‌ చదివి ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని పరిష్కరించేందుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ఏఏజీని కోరింది. కొన్నింటిని ఆర్టీసీ యాజమాన్యమే పరిష్కరించాలని, యూనియన్లు డిమాండ్లుగా పేర్కొనాల్సినవే కాదని అభిప్రాయపడింది. 42 డిమాండ్లల్లో సగానికిపైగా అలాంటివేనని, పైగా వాటికి ఆర్థిక అంశాలతో సంబంధం లేదని వివరించింది. కరీంనగర్, హైదరాబాద్‌ జోన్‌లకు ఈడీల నియామకం, ఉద్యోగ భద్రత మార్గదర్శకాల రూపకల్పన, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల లభ్యత, వైద్య బిల్లుల రీయింబర్స్‌మెంట్, రిటైర్డు కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఆసరా పింఛన్లు, అనారోగ్యం వచ్చినప్పుడు పీఎఫ్‌ విత్‌డ్రా సౌకర్యం, డిపోల్లో విడిభాగాల లభ్యత, వోల్వా బస్సుల ద్వారా శిక్షణ, సిబ్బంది పిల్లలకు ఐటీఐలో శిక్షణ వంటి సగానికిపైగా డిమాండ్లు సులువుగా పరిష్కరించదగ్గవేనని ధర్మాసనం అభిప్రాయపడింది. విడిభాగాలు కావాలంటే ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసమే కదా, శిక్షణ కోరుతున్నది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు కోసమే కదా, ఈడీ వంటి పోస్టుల భర్తీ వల్ల సంస్థకే మేలు కదా, వైద్య, ఆరోగ్య రంగానికి కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో రిటైర్డు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే మేలే కదా.. అని ధర్మాసనం పేర్కొంది. భావితరాల వాళ్లు ఎలా ఉండాలో టాటా స్టీల్‌ సిటీ జంషెడ్‌పూర్‌లో ఇస్తున్న శిక్షణను పరిశీలిస్తే మనమేం చేయాలో అర్థం అవుతుందని, అక్కడ వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్లుపై నిలవదని, మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలని కోరుతుంటే ఆలోచన ఎందుకుని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనిపై ఏఏజీ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఇతర డిమాండ్లపై చర్చించబోమని యూనియన్లు మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

ఆర్టీసీలో విలీనం డిమాండ్‌ పాతదే: యూనియన్లు
యూనియన్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌కు ఇతర అంశాలను ముడిపెట్టలేదన్నారు. విలీనం డిమాండ్‌ చేస్తూనే ఇతర విషయాలపై చర్చలకు యూనియన్లు సిద్ధంగానే ఉన్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఇప్పటిది కాదని, 2013లో నాటి ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనానికి కమిటీ వేసిందన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ యూనియన్లు, ఆర్టీసీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 19న బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, 21 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభమైతే సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, మద్రాస్‌ హైకోర్టు గతంలో ఆ మేరకు తీర్పు చెప్పిందన్నారు. దీనిపై ప్రకాశ్‌రెడ్డి కల్పించుకొని యూనియన్లు, యాజమాన్యం ఒకటేనని పిటిషనర్‌ ఆరోపించడాన్ని ఖండించారు. గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశించాక చర్చలకు యూనియన్‌ సిద్ధంగా ఉందని అడ్వకేట్‌ జనరల్, అదనపు అడ్వకేట్‌ జనరల్‌లకు ఫోన్‌ చేసి చెప్పినా ఫలితం లేకపోయిందని వివరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని, సమస్య జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అమలుకాని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. యూనియన్, జేఏసీ ప్రతినిధులను ఆర్టీసీ ఎండీ (ఇన్‌చార్జి) పిలిచి చర్చలు జరిపి సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా చూడాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement