అనన్యసామాన్యమైన పోరాట పటిమ, అపూర్వ పరిపాలనా దక్షత, అద్వితీయ కళాపిపాస కలిగిన కాకతీయుల చరిత్రకు సాక్ష్యాలు వారి కళారూపాలు. కాకతీయుల కళామణిహారంలోంచి జాలువారిన ఆణిముత్యాలుగా, కాకతీయుల ప్రతిభకు తార్కాణాలుగా అనేక ఆలయాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నాడు కళకళలాడిన ఆ ఆలయాలు నేడు పూజలు లేక వెలవెలబోతున్నాయి. అలాంటి ఆలయమే త్రికూటాలయం..
ఎక్కడ ఉంది..
కరీంనగర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భీమదేవరపల్లి మండలంలో ఉన్న ముత్తారం గ్రామంలో కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం ఉంది. ఆలయం తూర్పు ముఖ ద్వారాన్ని కలిగి ఉంది. ఇటువంటి ఆలయాలను మనం కొత్తపల్లి, నగునూరు గ్రామాల్లో కూడా చూడవచ్చు. ఆలయానికి తూర్పు వైపు ఉన్న ప్రవేశ మండపం, మధ్యలో ఉన్న ముఖ మండపం శిథిలావస్థకు చేరుకున్నాయి. మధ్య మండపానికి పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులకు మూడు గర్భ గృహాలు, వాటి ముందు అంతరాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం బట్టి 13వ శతాబ్దానికి చెందినదిగా చెప్పవచ్చు. ఆలయ ఉపపీఠం నక్షత్రాకారంలో ఉండి, చుట్టూ పద్మాలు చెక్కిన పట్టికలతో నిర్మించారు.
పడమర, దక్షిణ దిక్కుల్లో శివలింగాలు ఉండగా, ఉత్తర గర్భ గుడిలో విష్ణువు ఉన్నారు. ఆలయంలో ఉన్న రెండు శివలింగాలు కాకతీయ శైలిలో చెక్కబడి ఉన్నాయి. ఉత్తర గర్భ గుడిలో ఉన్న ఆలయంలో నాలుగు అడుగుల ఎత్తు ఉన్న విష్ణు మూర్తి విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో నాలుగు చేతులతో ఉంది. పైన ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము ఉన్నాయి. కింది రెండు చేతులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విష్ణు మూర్తికి రెండు వైపులా చామరదారిణిలు ఉన్నాయి. కుడివైపు కింది భాగంలో గరుత్మంతుడు ఉన్నాడు. త్రికూటాలయానికి ఉత్తర దిక్కులో కొంత దూరంలో చెట్టు కింద ఒక పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. ఇది హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటుంది.
కాలగర్భంలో కలిసిపోతున్న ఆలయాలు
ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం వల్ల కాకతీయుల కాలంలో నిర్మించిన ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం నెలకొంది. అద్భుత శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరాయి. గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో దుండగులు ఆలయంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని బయటికి పెకలించి వేశారు. ఆలయానికి అక్కడక్కడా పగుళ్లు వచ్చాయి. కాకతీయుల కాలంలో ఘనంగా పూజలు అందుకున్న ఈ ఆలయం నేడు ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. ఇది ఇలానే కొనసాగితే అద్భుత చరిత్ర, శిల్ప సంపద కాల గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు శాఖను పటిష్టపరిచి వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment