సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుని ఉగ్ర తాపానికి ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ప్రజలు రోడ్లపైకి రాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో శుక్రవారం 44 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో తొమ్మిది పాత కరీంనగర్ పరిధిలోనే ఉండడం గమనార్హం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్, జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామాల్లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అక్కడి నుంచి వరుసగా పెద్దపల్లి జిల్లా పెద్దపాపయ్యపల్లి మండలం పాలుథెమ్ గ్రామంలో 43.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మేడిపల్లి గ్రామంలో 43.08 డిగ్రీలు, కరీంనగర్ రూరల్ మండలం దుర్శెడు, జమ్మికుంట, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, గోధూర్ గ్రామాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 10 అత్యధిక ఉష్ణోగ్రతల్లో తొమ్మిది ప్రాంతాలు కరీంనగర్ జిల్లావే కావడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్ తరువాత పదవ స్థానంగా కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం జంబ్‌గా గ్రామంలో 43.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జనం రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు.
నిప్పుల కుంపటి
కోల్‌సిటీ(రామగుండం): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా మారింది. భానుడు భగభగ మండుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోఆదువుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. పగటి వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..
వారం రోజుగులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో శుక్రవారం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేసుకోగా, పెద్దపల్లి జిల్లాలో 43.9 డిగ్రీల వరకు నమోదైంది. గాలితో తేమశాతం తగ్గిపోతోంది. దీంతో ఉక్కపోత పెరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం వడగాలలు ఎక్కువగా వీచాయి. గాలి దుమారం పెరిగింది. గత మూడు రోజులుగా భూమి సెగలు కక్కుతోంది. వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
వడదెబ్బతో జాగ్రత్త...
ఎండల ప్రభావంతో ప్రతీ ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్‌హిట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చమట ఎక్కువగా రావడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లవచ్చు. శరీరంలో ప్రొటిన్‌స్థాయి తగ్గిపోయి అవయవాల పనితీరుపై ప్రభావడం చూపుతాయి. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ సాధారణ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment