సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామాల్లో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై) పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. వీటితో పాటు పర్యావరణం, సామాజిక భద్రత, సుపరిపాలన తదితరాలు లక్ష్యంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించారు.
ఏడాదిలో ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం పరిధిలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి. అయితే జిల్లాలో ఎస్‌ఏజీవై అమలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు లోక్‌సభ సభ్యులు చెరో వెనుకబడిన గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. దామరగిద్ద మండలం మొగుల్‌మడ్కను మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, మల్దకల్ మండలం అమరవాయిని నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఎస్‌ఏజీవై కింద గత యేడాది ప్రతిపాదించారు.
పథకం నిబంధనల మేరకు ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో గ్రామ, ప్రజల జీవన స్థితిగతులపై అధికారులు బేస్‌లైన్ సర్వే నిర్వహించారు. బేస్‌లైన్ సర్వే ఆధారంగా ఏడు నెలల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళిక (వీడీపీ)ని రూపొందించాలి. పథకం ప్రారంభమైన తొమ్మిదో నెలలో అభివృద్ధి పనులు ప్రారంభమై ఏడాది వ్యవధిలో పూర్తికావాలి. అయితే పథకం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా ఇంకా బేస్‌లైన్ సర్వే స్థాయిలోనే పనులు జరుగుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌లో బేస్‌లైన్ సర్వే వివరాలు నమోదు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ అప్‌లోడింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వీడీపీ ప్రతిపాదనలకు కేంద్రం నిధుల మంజూరుకు అంగీకరిస్తుంది.
అటు వైపే వెళ్లని ఎంపీలు
ఎంపిక చేసిన గ్రామాల్లో పార్లమెంటు సభ్యులు తరచూ పర్యటించి స్థానికులను గ్రామాభివృద్ధి దిశగా ప్రోత్సహించాలి. అయితే, నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఇప్పటి వరకు అమరవాయి గ్రామాన్ని సందర్శించలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి మొగుల్‌మడ్కలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమరవాయికి జిల్లా పరిషత్ సీఈఓ, మొగుల్‌మడ్కకు జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఏజీవై గ్రామాల్లో బేస్‌లైన్ సర్వేతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఇప్పటివరకు సంపూర్ణంగా సమీక్షించిన దాఖలాలు కూడా లేదు. 2019 నాటికి ఒక్కో ఎంపీ మూడు గ్రామాలు, 2024 నాటికి ఐదు వెనుకబడిన గ్రామాలను ఎస్‌ఏజీవై ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది.
వారం రోజుల్లో పూర్తి
బేస్‌లైన్ సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేస్తాం. త్వరితగతిన కంప్యూటరీకరించేలా ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశాం. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి కావాల్సిన నిధులు తదితరాలపై ఓ అంచనాకు వచ్చాం. త్వరలో ఎంపీలు కూడా గ్రామాల్లో పర్యటిస్తారు.
- నాగమ్మ,
సీఈఓ, జిల్లా పరిషత్
సమస్యలపై సమరం
జిల్లాలోనే అత్యధిక వెనుకబడిన గ్రామం మొగుల్‌మడ్క. గతంలోనూ అనేక పర్యాయాలు గ్రామాన్ని వ్యక్తిగతంగా సందర్శించా. అందరి అధికారులతో శుక్రవారం గ్రామంలోనే సమీక్ష నిర్వహిస్తాం. రాత్రి బస చేసి గ్రామస్తులతో మరిన్ని అంశాలపై చర్చిస్తా.
- జితేందర్‌రెడ్డి,
ఎంపీ, మహబూబ్‌నగర్
‘ఆదర్శం’ పట్టాలెక్కేనా?
Published Fri, Feb 13 2015 2:29 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM
Advertisement