ఆదాయం చాలా బాగుంది..
పన్నుల ఆదాయం నాలుగు నెలల్లో 11,500 కోట్లు
రాష్ర్ట పన్నుల ద్వారా ఏడాదికి 35 వేల కోట్లపైనే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో పన్నుల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడంపై అధికారవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయమే 53 శాతం ఉంటుందని వేసిన అంచనా కంటే తక్కువగా రావడం గమనార్హం. తెలంగాణ అధికారులు ముందునుంచీ చెబుతున్నట్లు 43 నుంచి 46 శాతం మధ్య ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వస్తువుల అమ్మకం పన్ను, వాహనాల పన్ను, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లతోపాటు పన్నేతర ఆదాయంగా మినరల్స్‌లో ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. గడిచిన నాలుగు నెలల్లో 11,500 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆ అధికారి చెప్పారు. వస్తు అమ్మకం పన్నులో సెప్టెంబర్ చివర్లో ఆదాయం బాగా వచ్చిందని సమాచారం. ఈ నెలలో ఒక్క అమ్మకం పన్ను రూపంలో రూ.2,400 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆ వర్గాలు చెప్పాయి.
ప్రధాన ఆదాయ వనరులతో పాటు, రాష్ర్ట పన్నులూ ఏడాదికి రూ.35 వేల కోట్లకు పైగా వస్తుందని అంచనా వేయగా.. గడిచిన నాలుగు నెలల కాలంలో ప్రతినెలా ఆదాయం మూడువేల కోట్ల రూపాయల వరకు వస్తున్నట్లు తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వంపై ప్రజల ఆకాంక్షలు అధికంగా ఉన్న నేపథ్యంలో పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ వనరులను పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం నియమించిన ఆదాయ సమీకరణ టాస్క్‌ఫోర్స్ కమిటీ పలు సిఫారసులతో నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.