
మళ్లీ జబ్బార్ ట్రావెల్స్ బస్సుకు రోడ్డుప్రమాదం
మహబూబ్ నగర్: జిల్లాలోని కొత్తపేట మండలం పాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున మళ్లీ జబ్బార్ ట్రావెల్స్ బస్సుకు రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద వరికోత యంత్రాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది.
తీవ్రగాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా మారడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. గతంలో ఇదే స్థలంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.