కాంగ్రెస్‌కు జనార్దన్‌గౌడ్ రాజీనామా | janardhan goud resigns to congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు జనార్దన్‌గౌడ్ రాజీనామా

Published Sat, Apr 12 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

janardhan goud resigns to congress party

ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ టికెట్ కేటాయింపులో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఆరు మండలాల కార్యకర్తలతో కలిసి తీసుకున్న నిర్ణయంగా వారు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధిష్టానం పెద్దలు నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తున్నారని, అభివృద్ధి నిధులు సైతం పక్క మండలాల నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

ఆయన హయాంలోనే వచ్చిన నిధులు తప్ప అటు తరువాత మంజూరు కాలేదన్నారు. 2010 ఉప ఎన్నికల్లో సైతం స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. నాటి నుంచి ప్రారంభమైన వివక్ష ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా బయటపడిందన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, కామారెడ్డికి చెందిన నాయకునితో కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రావాల్సిన నిధులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో కేవలం  38 లక్షలు మాత్రమే నియోజకవర్గానికి ఎంపీ నిధులు మంజూరు చేశారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి పాటుపడిన ఎందరో సీనియర్లు ఉండగా కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారన్నారు.

 ఈ విషయమై ఈనెల 7న ఆరు మండలాల నాయకులతో కలిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధిష్టానం గుర్తించలేదన్నారు. దీంతో కార్యకర్తలంతా కలిసి తీసకున్న నిర్ణయానుసారం పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు రాజీనామా చేసినవ వారిలో మాజీ మంత్రి నేరేళ్ల అంజనేయులు, డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, వైఎస్ చెర్మైన్ శ్రీనివాసరెడ్డితో పాటు 13 మంది డెరైక్టర్లు, షాదీఖానా చెర్మైన్ ఇబాదుల్లా, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల అధ్యక్షుడు శ్రీనివాస్ జోషి, శ్రీధర్‌గౌడ్, ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ పప్పువెంకటేశం, నాయకులు కృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, హబీబ్, ప్రతాప్‌గౌడ్, రఘువీర్‌గౌడ్, రాంమోహన్, విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మురళి, బాలయ్యతో పాటు 100 మంది కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
Advertisement