సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ నుంచి ఇంకా ముప్పు తప్పలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేత లు అసంతృప్తి సెగలు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీ అధిష్టానాలు బుజ్జగింపులు మొదలు పెట్టినప్పటికీ నామినేషన్లు వేసిన తిరుగుబాటు అభ్యర్థులు మెత్తపడడం లేదు. ఇందుకు కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలో ఏ పార్టీ అతీతం కాదు. ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు టికెట్ దక్కకపోగా, ఆశలు గల్లంతు కావడా న్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ చేజారిన ఆశావహులు అవమాన భారంతో ఇంటి గడప దాటడం లేదు. టీఆర్‌ఎస్ టికెట్ రాని నేతలు పార్టీ అభ్య ర్థులతో కలిసి తిరుగుతున్నా మనోవేదన నుంచి పూర్తిగా కోలుకోలేక పోతున్నారు.
అనూహ్యంగా తెరపైకి వచ్చిన పొత్తులతో ఆశలు గల్లంతైనా బీజేపీ నేతలు చాలాచోట్ల టీడీపీ నేతల ఓటమిని కళ్లచూడాలన్న శపథంలో ఉన్నారు. బుధవారం నామి నే షన్ల పర్వం ముగియగా, రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. ‘బి’ఫారాలు సమర్పించకుండా, డమ్మీలుగా వేసిన పలువురి నామినేషన్లు గురువారం తిరస్కరణకు గురయ్యాయి. ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేందుకు అసంతృప్తులు సిద్ధమవుతున్నారు. రెబెల్స్ ఉప సంహరణకు టీడీపీ గురువారం రాత్రి వేసిన త్రిసభ్య కమిటీలో జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర్‌రావుకు స్థానం కల్పించగా, జిల్లాలో ఆ పార్టీకే ఎక్కువ మంది రెబల్స్‌గా ఉన్నారు.
చేతికి చిక్కే
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గోల రగులుతూనే ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు అసంతృప్తి పొంచి ఉంది. ఆయన అభ్యర్థి త్వాన్ని ఇతర నాయకులు కొందరు తట్టుకుని కలిసి నడిచే పరిస్థితిలో లేరు. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ కాసుల బాలరాజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్ వేసిన ఆ పార్టీ నేతలు సంగెం శ్రీనివాస్‌గౌడ్, మాసాని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగాధర్‌కు రెబల్‌గా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార ఉన్నారు. ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్‌కు మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ గండం ఉంది.
కమలానికి ‘నో’
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఉన్న బీజేపీ అభ్యర్థిని టీడీపీ నేత బాన్సువాడ సుభాష్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎన్నికలలో ప్రచారానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నామినేషన్ వేయ గా, ప్రముఖ వ్యాపారవేత్త పొద్దుటూరి సదానందరెడ్డి పోటీగా ఉన్నారు. బాల్కొండలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డికి బీజేపీ నేత ముత్యాల సునీల్‌రెడ్డి, బోధ న్‌లో టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి బీజేపీ నేత కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి బెడద ఉంది.
గులాబీకీ గుబులే
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు అసంతృప్తి చాపకింది నీరులా ఉంది. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌పై ఇటు నాయకులలోనూ అటు కేడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహారాష్ర్టలో వ్యాపారిగా స్థిరపడిన బీబీ పాటిల్‌కు తెలుగు రాకపోగా, ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఆయన ఎలా నెట్టుకొస్తారన్న చర్చ కూడ ఆ పార్టీలో ఉంది. జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌సింధేపై మాజీ ఎమ్మెల్యే పండరి పోటీకి సిద్ధమయ్యారు.
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రెబల్స్‌గా నామినేషన్ వేసిన గంగాధర్‌రావు దేశాయి, డి మాదవ్ యాదవ్ ఈసారి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్త పట్ల పార్టీ ముఖ్య నేతల్లో సానుకూలత లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేత లు ఆయన వెంట తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా తెలియని అసంతృప్తిని క్యాడర్ వద్ద వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలా పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు అసంతృప్తుల భయం వెంటాడుతోంది.
మోగుతున్న రెబెల్స్
Published Fri, Apr 11 2014 3:27 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement