నచ్చిన కంపెనీతోనే గ్రీన్‌హౌస్ నిర్మాణం | Kampenitone that the construction of greenhouses | Sakshi
Sakshi News home page

నచ్చిన కంపెనీతోనే గ్రీన్‌హౌస్ నిర్మాణం

Published Fri, Nov 28 2014 1:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

నచ్చిన కంపెనీతోనే గ్రీన్‌హౌస్ నిర్మాణం - Sakshi

నచ్చిన కంపెనీతోనే గ్రీన్‌హౌస్ నిర్మాణం

  •  రైతులకు వెసులుబాటు.. సాంకేతిక మార్గదర్శకాలు ఖరారు  
  •  రెండు మూడు రోజుల్లో టెండర్ల ప్రకటన జారీకి నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: టెండర్ల ద్వారా అర్హత పొందిన గ్రీన్‌హౌస్ కంపెనీల జాబితా నుంచి నచ్చిన వాటిని ఎంచుకునే సదుపాయాన్ని రైతులకు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గ్రీన్‌హౌస్‌కు సంబంధించి వ్యవసాయశాఖ సాంకేతిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు సమావేశమైన ఆ కమిటీ తాజాగా తుది మార్గదర్శకాలు ఖరారు చేసింది.

    గ్రీన్‌హౌస్ కంపెనీలకు కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. అలాంటి వాటినే టెండర్లకు ఆహ్వాని స్తారు. ఏడాదికి కనీసం 25 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ ప్రాజెక్టు చేపట్టి ఉండాలి. బ్యాంకు సెక్యూరిటీ రూ. 25 లక్షలు చూపాలి. రూ. 5 లక్షలు డిపాజిట్ చెల్లించాలి. ప్రాజెక్టు అప్పగించాక 21 రోజు ల్లో పని మొదలుపెట్టి.. రెండు నెలల్లోగా పూర్తిచేయాలి. ఆలస్యమైతే జరిమానా విధిస్తారు. అనుకున్న మెటీరియల్ వాడకపోయినా.. కొలతలు తక్కువగా ఉన్నా ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతారు.

    చెల్లించిన సొమ్ము తిరిగి రాబడతారు. పాలిథిన్ ఏది వాడాలో కూడా ముందుగా స్పష్టంచేయాలి. నాలుగు స్లాబుల్లో ధరల నిర్ణ యం ఉంటుంది. వీటన్నింటికీ ఒప్పుకున్న కంపెనీలకే టెండర్లలో అవకాశం కల్పిస్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీల జాబితాను బహిరంగ పరిచి రైతులకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకొని అర్హత పొందిన రైతులు సంబంధిత కంపెనీ జాబితా నుంచి తమకు ఇష్టమైన కంపెనీని ఎంచుకునే సదుపాయం కల్పించారు.

    వ్యవసాయ యంత్రాల కొనుగోలులో నచ్చిన వాటిని కొనుక్కునే వెసులుబాటును రైతులకు ఎలా కల్పిస్తున్నారో.. గ్రీన్‌హౌస్ విషయంలో కూడా రైతులకు అలాగే కల్పించాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం అనుకున్న ధర కన్నా ఎక్కువ కోట్ చేసిన కంపెనీని కూడా రైతు ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్ణీత సబ్సిడీనే చెల్లిస్తుంది. మిగతాది రైతు భరించాల్సి ఉంటుంది.
     
    యుద్ధప్రాతిపదికన గ్రీన్‌హౌస్..

    ప్రభుత్వం గ్రీన్‌హౌస్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే టెండర్లకు ప్రకటన జారీచేయాలని ఉద్యానశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి జనవరి నుంచి గ్రీన్‌హౌస్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. సాం కేతిక కమిటీ సభ్యులే టెండర్లను ఖరారు చేస్తా రు. దాదాపు 20 కంపెనీల వరకు జాబితా ఉం డేలా చూస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ. 250 కోట్లతో వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్ చేపట్టాలంటే యుద్ధప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే తమకు ఉండాల్సిన 160 మంది సిబ్బందిలో 100 వరకు ఖాళీలున్నాయని ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత తక్కువ సిబ్బందితో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా పూర్తిచేయాలో అర్థంకావడంలేదని ఆయన అన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement