ఉత్కంఠకు తెర | Karimnagar Corporation Polling Is After Municipal Election | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పోలింగ్‌

Published Fri, Jan 10 2020 8:11 AM | Last Updated on Fri, Jan 10 2020 8:12 AM

Karimnagar Corporation Polling Is After Municipal Election - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన తరువాత రెండు రోజులకు ఈ నెల 24న కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని 60 వార్డులకు పోలింగ్‌ జరుగనుంది. కార్పొరేషన్‌ పరిధిలోని 3, 24, 25 వార్డులకు ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును గురువారం డివిజన్‌ బెంచ్‌ నిలిపివేస్తూ ఎన్నికల నిర్వహణకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి గురువారం సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. స్క్రూటినీ, అభ్యంతరాలు, ఉపసంహరణలు తదితర ప్రక్రియలు ముగిసిన తరువాత 16వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీన 60 డివిజన్‌లలో పోలింగ్‌ జరుగుతుంది. 25న అవసరమైన చోట రీపోలింగ్‌ నిర్వహించి 27న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.

(చదవండి: కరీంనగర్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌)

రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా పోలింగ్‌ తేదీ
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్‌ ఎన్నికలు ఈ నెల 22న జరుగనుండగా, 25న ఓట్ల లెక్కింపు జరిపి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. కరీంనగర్‌ పోలింగ్‌ను ఒకవేళ 25 తరువాత నిర్వహించాల్సి వస్తే ఆ ఫలితాల ప్రభావం కరీంనగర్‌ ఎన్నికపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా 24వ తేదీనే కరీంనగర్‌ పోలింగ్‌కు ముహూర్తంగా నిర్ణయించింది. అన్ని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల తరువాత రిపబ్లిక్‌ దినోత్సవం మరుసటి రోజు 27న ఫలితాలు వెలువడనున్నాయి. 

ఊపిరి పీల్చుకున్న ఆశావహులు
మూడు వార్డుల్లో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఎన్నికల సంఘం కరీంనగర్‌ కార్పొరేషన్‌ను మినహాయించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో తెల్లవారితే నామినేషన్లు దాఖలు చేయాలని ఏర్పాట్లు చేసుకున్న నాయకులు ఒక్కసారి నిరుత్సాహానికి గురయ్యారు. బుధవారం నోటిఫికేషన్‌ వెలువడుతుందని భావించినప్పటికీ, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ జరపలేదు. గురువారం మధ్యాహ్నం 2 గంటల తరువాత హైకోర్టు స్టే ఉత్తర్వులను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్‌ ఎన్నికకు అడ్డంకులు తొలిగి నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ భవితవ్యాన్ని నామినేషన్ల ద్వారా పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా నోటిఫికేషన్‌ రెండు రోజులు ఆలస్యంగా విడుదల కావడంతో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీల నాయకులకు మరింత స్పష్టత వచ్చినట్లయింది. టికెట్లు రావని భావించిన టీఆర్‌ఎస్‌లోని కొందరు నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఈ రెండు రోజుల్లో మరిన్ని కప్పదాట్లు సాగే అవకాశం ఉంది.

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌

  • ఈ నెల 10 నుంచి 2 వరకు నామినేషన్లు
  • 13న నామినేషన్ల పరిశీలన, అర్హత గల అభ్యర్థుల ప్రచురణ
  • 14న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం
  • 15న అప్పీల్‌లో అర్హత పొందిన వారి వివరాల ప్రకటన  
  • 25న రీపోలింగ్‌(అవసరమైతే)
  • 27 న కౌంటింగ్, ఫలితాల ప్రకటన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement