మామూళ్ల ‘కిక్’ | kick | Sakshi
Sakshi News home page

మామూళ్ల ‘కిక్’

Published Wed, Dec 3 2014 3:22 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

మామూళ్ల ‘కిక్’ - Sakshi

మామూళ్ల ‘కిక్’

ఆబ్కారీ శాఖ అధికారులకు మామూళ్ల మత్తు తలకెక్కింది. జిల్లాలో ఏటా ఆబ్కారీ మామూళ్ల మొత్తం రూ.3.6 కోట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎక్సైజ్ సిబ్బందికి ఆమ్యామ్యాల ద్వారా వచ్చే ‘గీతం’తో పోలిస్తే ప్రభుత్వం చెల్లించే ‘జీతం’ దిగదుడుపే. ఇదంతా చాలదన్నట్లు అధికారులు తాజాగా చందాల పేరిట కొత్త దందాకు శ్రీకారం చుట్టారు. ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన పేరుతో ప్రతీ వైన్‌షాపు నుంచి చందాలు సేకరిస్తున్నారు. వసూళ్లు, చందాలతో లబోదిబోమంటున్న మద్యం దుకాణాల యజమానులు ఆమ్యామ్యాల భారం ప్రజలపై రుద్దుతున్నారు.        
 - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో 301 మద్యం దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల్లో అమ్మకాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి నెలవారీ లంచాలు ఫిక్స్ చేశారు. తక్కువగా అమ్మకాలు జరిగే మద్యం దుకాణానికి రూ.5 వేలు, భారీగా విక్రయించే దుకాణానికి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన నెలనెలా రూ.30 లక్షలకుపైగా లంచాల రూపంలో ఎక్సైజ్ అధికారులకు చేరుతున్నాయి. అంటే ఏటా రూ.3.6 కోట్లు ఎక్సైజ్ సిబ్బంది జేబుల్లోకి వెళ్తోంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్క్వాడ్, విజిలెన్స్ పేరిట అప్పుడప్పుడు దాడులకు దిగే వారికి చెల్లించే సొమ్ము అదనమే.
 
 కానిస్టేబుల్ నుంచి డీసీ వరకు..
 నెలనెలా వసూలవుతున్న ఆమ్యామ్యాల మొత్తాన్ని కానిస్టేబుల్ నుంచి డెప్యూటీ కమిషనర్ వరకు ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16 ఎక్సైజ్ స్టేషన్లుండగా.. సూపరింటెండెంట్‌కు గరిష్టంగా రూ.5 లక్షలు, సీఐలకు లక్ష, ఎస్సైలకు రూ.40 వేలు, కానిస్టేబుల్‌కు రూ.10 వేల చొప్పున పంపకాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్, డెప్యూటీ కమిషన ర్లకూ మామూళ్లు అందుతున్నాయి. ప్రస్తుతం డెప్యూటీ కమిషనర్ లేకపోవడంతో ఆయన స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ ఇన్‌చార్జి డీసీగా కొనసాగుతుండటంతో ఎక్సైజ్ సిబ్బందిపై ఆజమాయిషీ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి.
 
 దేవుడి పేరిట చందాల దందా
 రెగ్యూలర్‌గా మామూళ్లు వసూలు చేస్తున్న ఆబ్కారీ సిబ్బంది.. కొత్తగా చందాల దందాకు శ్రీకారం చుట్టారు. ఇన్‌చార్జి డెప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న శివనాయక్ స్వస్థలం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట. ఆ ఊర్లో శ్రీ ప్రసన్నాంజయనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన శివనాయక్ విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించారు. చందాల పుస్తకాన్ని సిబ్బందికి అందజేశారు. దేవుడి పేరిట నిర్వహించే కార్యమైనందున ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలిస్తే తగిన రశీదు ఇవ్వాలని సూచించారు. దీన్ని అలుసుగా తీసుకున్న సిబ్బంది మద్యం దుకాణాల నుంచి బలవంతంగా వసూళ్లకు దిగారు.
 
 ఒక్కో మద్యం దుకాణ యజమాని రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొందరు సిబ్బంది దుకాణ యజమానులు చెల్లించే సొమ్ములో సగం నొక్కేసి మిగితా మొత్తానికి రశీదు ఇస్తున్నారు. విషయం తెలుసుకున్న శివనాయక్ దేవుడి పేరుతో సత్కార్యాన్ని చేయాలని భావిస్తే దానినీ సొంతానికి వాడుకుంటున్నారని కొందరు అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది. చందాల పేరుతో ఎవరినీ బలవంతపెట్టొద్దని సూచించినా.. సిబ్బంది మాత్రం అదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. లాభం లేదని భావించిన శివనాయక్ రశీదుల పుస్తకాన్ని వాపస్ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.
 
 భారమంతా మందుబాబులపైనే
 ఆమ్యామ్యాలు, చందాలు, ఇతర మామూళ్ల భారాన్ని మద్యం దుకాణాల యజమానులు మందుబాబులపై మోపుతున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10, బీరు సీసాపై రూ.15 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేస్తున్నా ఎక్సైజ్ అధికారుల నుంచి సరైన స్పందన కరువైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement