మందుబాబుల మద్యం ధర్నా
కరీంనగర్(హుస్నాబాద్) : అసలే ఎండాకాలం... కాస్త చల్లగా ఉంటుందని ఓ బీర్ వేద్దామని వైన్స్‌కు వెళ్లారు. వీరు అడిగిన బ్రాండ్ లేదని షాప్ వాళ్లు అన్నారు. ఆ మద్యం ప్రియులకు ఇష్టం లేని బ్రాండ్ బీర్‌ను... అది కూడా ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు ఇచ్చారు. దీంతో వాళ్లకు చిర్రెత్తి ఆందోళనకు సిద్ధమయ్యూరు. వీరికి నాయకులు సైతం తోడై చివరకు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువకు బీర్లు విక్రయిస్తున్నారంటూ హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు.
కింగ్‌ఫిషర్లాంటి బీర్లు బెల్ట్‌షాపులకు విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, వైన్స్‌ల్లో దొరకని బీర్లు రూ.20 ఎక్కువకు బెల్ట్‌షాపుల్లో లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎమ్మార్పీ రూ.95 ఉన్న బీర్‌ను బెల్ట్‌షాపుల్లో రూ.130కి అమ్ముతున్నారని వాపోయూరు. ఒకటే బ్రాండ్‌ను మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారని, ఇష్టం ఉన్నా లేకపోయినా.. అదే బ్రాండ్ అంటగడుతున్నారని వాపోయారు. వైన్స్ యాజమాన్యాలు అన్ని రకాల బీర్లను ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని, లేనిపక్షంలో దుకాణాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సింగిల్‌విండో డెరైక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, సీపీఎం పట్టణ కార్యదర్శి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.