
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా ‘కారు’ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎత్తుగడలతో కాంగ్రెస్ కలవరం చెందుతోంది. ఫిరాయింపులను ఆపలేక చిత్తుచిత్తవుతోంది. తెల్లారితే చాలు ఏ ఎమ్మెల్యే ‘చే’జారిపోతారో తెలియని అయోమయం ఆ పార్టీలో నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితి ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఏడుగురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించగా, మరికొందరు అదే బాటలో ఉన్నారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టనీయడం లేదు.
కాంగ్రెస్‌కు షాక్‌మీద షాక్...
శాసనసభ ఎన్నికల్లో తీవ్ర ఓటమి పాలైన కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ వరుస షాక్‌లు ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఆరుగురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లుగా శుక్రవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై గాంధీభవన్ వర్గాలను ఆరా తీయగా వనమా తిరుపతిలో ఉన్నట్లుగా తెలిపారు. సుధీర్‌రెడ్డి మాత్రం తాను టీఆర్‌ఎస్ చేరబోతున్నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ సైతం పార్టీ మారతారని, 19న సీఎం కేసీఆర్ సభలో టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖమ్మంలోనూ ఖతం...
అలాగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలిచింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాగా, ప్రస్తుతం అక్కడ కూడా పార్టీ ఖాళీ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 స్థానాలకు గాను టీడీపీ 2, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. ఒకచోట ఇండిపెండెంట్ గెలవగా, ఒక్కచోట మాత్రమే టీఆర్‌ఎస్ గెలిచింది. అయితే ప్రస్తుతం అక్కడ సీన్ మారుతోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ అందరికంటే ముందే టీఆర్‌ఎస్‌లో చేరగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంతా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కారు ఎక్కితే.. ఇక జిల్లాలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క (మధిర), పొడెం వీరయ్య (భద్రాచలం), టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) మాత్రమే జిల్లాలో టీఆర్‌ఎస్‌యేతర ఎమ్మెల్యేలుగా మిగలనున్నారు. ఈ ప్రభావం ఖమ్మం పార్లమెంట్‌పై పడుతుందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి..
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై శుక్రవారం రాత్రి ఆయన స్పందించారు. కేటీఆర్‌తో తాను సమావేశమైన మాట వాస్తవమేనని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలవబోతున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గాన్ని ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ తనకు పూర్తిస్థాయిలో హామీ ఇచ్చారని వివరించారు.
ఆరా తీసిన అధిష్టానం..
పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జారిపోతుండటంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కు ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో దీనిపై చర్చించింది. రాష్ట్ర పార్టీ, సీఎల్పీ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఎందుకు భరోసా కల్పించలేకపోతోందన్న అంశంపై చర్చించినట్లుగా తెలిసింది. ఈ మొత్తం ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఇప్పటికైనా చర్యలు తీసుకొని, గట్టి పోటీ ఇస్తామన్న ఐదారు స్థానాల్లో అయినా పార్టీ శ్రేణులకు మనోస్థైర్యాన్ని నింపాలని సూచించినట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment