హత్యకేసును ఛేదించిన పోలీసులు
ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన భర్త
హత్నూర : వేరొక మిహ ళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ సంఘటన మండలంలోని గోవిందరాజ్‌పల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్ల, సీఐ రాంరెడ్డిలు విలేకరులకు వివరించారు. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశం చిన్న కుమార్తె మహేశ్వరి (21)ని హత్నూర మండలం గోవిందరాజ్‌పల్లి గ్రామానికి చెందిన చాకలి పోచయ్య కుమారుడైన చాకలి గోపాల్ తో 2014 మార్చి 29న కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు.
అయితే అప్పటికే గోపాల్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పెళ్లి అయిన కొన్ని రోజుల నుంచే మహేశ్వరిని వేధిస్తూ కొట్టేవాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయితీ పెట్టి మహేశ్వరిని సంసారానికి పంపారు. అయినా గోపాల్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈనెల 16న రాత్రి ఇంట్లో తల్లి, తమ్ముడు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన గోపాల్ భార్య మహేశ్వరిని కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోవడంతో గొంతునులిమి గుడ్డతో ఉరేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మరుసటి రోజు రాత్రి (17వ తేదీ) గ్రామ శివారులోని నీటి గుంటలో పూడ్చివేశాడు. 18న తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో ప్రచారం చేశాడు.
భార్య మహేశ్వరి లెటర్ రాసిన విధంగా తనకు సంసారం చేయడం ఇష్టం లేదని ఒక లేఖను కూడా గోపాల్ సృష్టించాడు. 19న గ్రామస్తులు పలువురు మృతురాలి తండ్రి మల్లేశంకు ఫోన్ చేసి మీ కుమార్తె మహేశ్వరి రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదని సమాచారం ఇచ్చారు. కుమార్తె ఆచూకీ కోసం తండ్రి మల్లేశం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సాయంత్రం హత్నూర పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో స్థానిక పోలీసులు మంగళవారం ఉదయం మహేశ్వరి భర్త గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. తానే భార్యను చంపానని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. దీంతో నీటి గుంతలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
గోపాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రమోద్‌కుమార్ కూడా ఉన్నారు. కాగా అదనపు కట్నం కోసం తన కుమార్తె మహేశ్వరిని అల్లుడు గోపాల్ వేధించేవాడని, అందులో భాగంగానే తన కుమార్తెను హత్యచేశాడని మల్లేశం ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.