సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రైవేట్ పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. నగరంలో తగినన్ని పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ప్రైవేట్ స్థలాల యజమానులు పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా అటు వారికి ఆదాయంతో పాటు ఇటు ప్రజలకు పార్కింగ్ తిప్పలు తప్పుతాయని భావించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్కింగ్‌లు ఏర్పాటు చేసేందుకు స్థల యజమానులు ముందుకు రావాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. నగరంలో భారీ హోర్డింగుల ద్వారానూ ప్రచారం చేశారు. అయితే నెలరోజులు దాటినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ప్రైవేట్ పార్కింగ్‌లకు అనుమతి పొందేందుకు ఇప్పటి వరకు దాదాపు 15 మంది వరకు జీహెచ్‌ఎంసీ అధికారులను ఫోన్‌లో సంప్రదించినప్పటికీ, ముందుకొచ్చింది ఇద్దరే.
పార్కింగ్‌కు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని, స్థలంపై యజమాన్యపు హక్కులు తదితర అంశాలను పరిశీలించిన అధికారులు శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఎల్లారెడ్డిగూడలోని 500 గజాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు . ట్రేడ్‌లైసెన్సు ఫీజు కూడా చెల్లించడంతో ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అక్కడ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. దానిని జియోట్యాగింగ్ చేసి పార్కింగ్ సదుపాయంపై జీహెచ్‌ఎంసీ యాప్‌లోనూ పొందుపరచనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎస్టేట్స్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి ప్రాంతంలో వెయ్యి గజాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటుకు విజయకుమార్ అగర్వాల్ అనే మరొకరు దరఖాస్తు చేసుకున్నారని, స్థల పరిశీలన జరగాల్సి ఉందని తెలిపారు. నగరంలో తగినన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయలేకపోయిన జీహెచ్‌ఎంసీ.. ప్రైవేట్ పార్కింగ్‌ల ద్వారా సమస్య తీరగలదని భావించింది.కనీసం 100 గజాల నుంచి అంతకు మించి ఎంత స్థలంలోనైనా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
విస్తృత ప్రచారం..
తొలుత అందుబాటులోకి రానున్న ప్రైవేట్ పార్కింగ్‌పై విస్తృత ప్రచారం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. తద్వారా మరింత మంది వీటి ఏర్పాటుకు ముందుకు రాగలరని భావిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా అక్కడ ఎన్ని వాహనాలకు సదుపాయం ఉంటుందో తెలుసుకోవచ్చు. అడ్వాన్స్‌గా స్థలాన్ని రిజర్వు చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
మాల్స్‌లో ఉచిత పార్కింగ్ ఎప్పుడో.. ?!
మాల్స్, ఇతర వాణిజ్య కేంద్రాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్న పార్కింగ్ దందాకు చరమ గీతం పాడేందుకు మాల్స్, సినిమాహాల్స్, తదితర వాణిజ్య ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలని భావించారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులతో నిర్వహించిన ఒక సమీక్షలోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. దాంతో, త్వరలోనే ఫ్రీ పార్కింగ్ అమలులోకి రాగలదని అధికారులు భావించినప్పటికీ, నెలలు గడుస్తున్నా దానిపై ఎలాంటి కదలిక లేదు. దీంతో ప్రజలకు పార్కింగ్ భారం తప్పడం లేదు. మెట్రో స్టేషన్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.
పార్కింగ్ ఫీజులు ఇలా..
♦ కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు : రూ. 20, ఆ తర్వాత ప్రతి గంటకు :రూ. 5
♦ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు : రూ. 10 ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు: రూ. 5
Comments
Please login to add a commentAdd a comment