ఎర్ర చందనం వేలంలో ‘పతంజలి’ హవా | Patanjali to buy red scandal acution | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం వేలంలో ‘పతంజలి’ హవా

Published Thu, Jan 1 2015 2:28 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

Patanjali to buy red scandal acution

రూ.200 కోట్ల విలువైన 700 టన్నుల ఎర్ర చందనం కొన్న బాబా రామ్‌దేవ్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థ ‘పతంజలి’ పేరు ఇప్పు డు అంతర్జాతీయ ఎర్రచందనం వ్యాపార సంస్థ లు, అటవీ శాఖలో మార్మోగుతోంది. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థగా చిరపరితమైన న్యూఢిల్లీకి చెందిన ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ అత్యధిక పరిమాణంలో ఎర్రచందనం కొనుగోలు టెండర్లు దక్కించుకోవడమే ఇందుకు కారణం. ఎర్రచందనం విక్రయానికి ఇటీవల ఏపీ అటవీ శాఖ నిర్వహించిన గ్లోబల్ ఈ - వేలం కమ్ ఈ - టెండర్లలో 36 లాట్లను ‘పతంజలి’ చేజిక్కించుకుంది. భారత్ సహా 34 దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడి ఈ - వేలంలో 700 టన్నులను అది కైవసం చేసుకోవడం విశేషం.

వేలంలో వచ్చిన అత్యధిక ధరల ప్రాతిపదికన 117 లాట్లలో 2,694 టన్నుల ఎర్రచందనం విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 700 టన్నులకు రూ. 200 కోట్లు కోట్ చేసిన పతంజలి సంస్థ ఇప్పటికే 25 శాతం మొత్తాన్ని (రూ.50 కోట్లు)  డిపాజిట్ చేసింది. ఇలా ప్రభుత్వానికి వచ్చే రూ. 855.91 కోట్లలో సుమారు 25 శాతం పతంజలి సంస్థ నుంచే వస్తోంది. ఒక ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ ఇంత పెద్ద పరిమాణంలో ఎర్రచందనం దక్కించుకోవడం సాధారణ విషయం కాదని అటవీశాఖ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకూ ఎర్రచందనం వ్యాపారం చేయని పతంజలి సంస్థ ఈ సరుకును ఏమి చేస్తుందనే ఆసక్తి నెలకొంది.
 
 చెల్లింపులకు నేడే చివరి రోజు
  ఎర్రచందనం దక్కించుకున్న సంస్థలు తొలి విడత 25 శాతం డిపాజిట్ చేసే గడువు గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. మొత్తం 20 సంస్థలు  లాట్లను పొందగా, 15 సంస్థలు డిపాజిట్ చెల్లించాయి. 21 లాట్లు (500 టన్నులు) దక్కించుకున్న దుబాయ్ సంస్థ ‘డైమండ్ స్టార్’ బుధవారం వరకు డిపాజిట్ చెల్లించలేదు. ఈ సంస్థ తీరునుబట్టి డిపాజిట్ చెల్లిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ డిపాజిట్ చెల్లించకపోతే ఈ 500 టన్నులకు టెండరు రద్దు చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లించలేకపోయిన సంస్థలకు టెండరు సమయంలో అవి చేసిన డిపాజిట్‌ను ప్రభుత్వం వెనక్కు ఇవ్వదు. అపరాధ రుసుము కింద ఆ సంస్థలు ఈ మొత్తాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement